ఏయూక్యాంపస్: ప్రజల్లో డేటా సెంటర్ల పట్ల అవగాహన కల్పిస్తూ పర్యావరణ ప్రేమికులు బీచ్‌రోడ్డులో నిరసన తెలిపారు. ఆదివారం బీచ్‌రోడ్డులో ‘సేవ్ వైజాగ్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టేందుకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సంతకాలను సేకరించడం ప్రారంభించారు. అదే సమయంలో మరికొంత మంది విశాఖలో డేటా సెంటర్లు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. డేటా సెంటర్ల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖ నగరంలో తీవ్ర నీటి కొరత ఉందని, డేటా సెంటర్లు గనుక వస్తే ఆ నీటి సమస్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ డేటా సెంటర్లు కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపయుక్తంగా నిలుస్తాయని వారు నినదించారు. నిరసనకారులు ‘సే నో టు డేటా సెంటర్స్’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డేటా సెంటర్ల నిర్వహణకు ఎంత పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుందో, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తదితర అంశాలను ప్లకార్డుల రూపంలో చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే అదే సమయంలో అక్కడ జరుగుతున్న మరొక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సైతం విషయం పూర్తిగా గమనించకుండా ‘సేవ్ వైజాగ్’ బ్యానర్‌పై సంతకం చేశారు. ఆ తర్వాతే ఆయనకు అసలు విషయం తెలిసింది.
కోకో ఎరీనా వద్ద..
నగరంలో డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివారం బీచ్‌రోడ్డులోని కోకో ఎరీనా వద్ద నగరవాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారురాలు దీక్ష వంగూరు మాట్లాడుతూ.. డేటా సెంటర్ల భారీ సర్వర్ల నిర్వహణకు అత్యధికంగా విద్యుత్, నీరు అవసరమవుతాయని, ఇది నగర పర్యావరణానికి పెద్ద సవాలుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


