మహారాణిపేట: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు–ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్‌డీపీఎస్)లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం విశాఖలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాలులో ఘనంగా జరిగింది. సంస్థ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన సుమారు 550 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. శిక్షణ ద్వారా తాము పొందిన ఉపాధి అవకాశాలతో పాటు.. జీవితంలో మానవతా విలువలు, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నారో విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ క్రైమ్ ఏసీపీ భవ్య రెడ్డి మాట్లాడుతూ.. యువత సంప్రదాయ నైపుణ్యాలతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక రంగాలపై పట్టు సాధించి ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా బోధించిన మానవ విలువలు, సేవా తత్వమే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి లభించిన ‘హెల్త్ కేర్ అసిస్టెంట్’ శిక్షణా అనుమతి పత్రాన్ని ఆవిష్కరించారు.


