సర్‌ | - | Sakshi
Sakshi News home page

సర్‌

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

నేటి నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఫారం–2 నింపడం సామాన్యులకు శిరోభారం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల జిల్లాలో మొత్తం ఓటర్లు 20.23 లక్షలు ఇప్పటి వరకూ 63.10 శాతం వరకూ మ్యాపింగ్‌ పూర్తి

ఓటరుకు

పరీక్ష

మహారాణిపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తమవుతుండగా, మరోవైపు ఈ ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రచారం పరిమితంగానే ఉండటంతో, అనేక మంది ఓటర్లు నిర్లక్ష్యం చేస్తే ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2002 ప్రాతిపదిక ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకుని సమగ్ర సవరణ చేపట్టనున్నారు. ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జూన్‌ 15 నుంచి జులై 14 వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసి, నింపిన వివరాలను తిరిగి సేకరిస్తారు.

నేటి నుంచి ఇంటింటికీ బీఎల్‌వోలు

సోమవారం నుంచి జులై 14 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్‌ ఫారం–2ను రెండు ప్రతుల్లో అందజేస్తారు. ఫారం ఎలా నింపాలో బీఎల్‌వోలు వివరించి, నింపిన ఫారాన్ని తిరిగి స్వీకరిస్తారు. రెండు ప్రతుల్లో ఒకదాన్ని బీఎల్‌వో తీసుకుని, మరొకదాన్ని రశీదుగా ఓటరికి అందజేస్తారు. బీఎల్‌వో వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే ఫారాన్ని అక్కడే ఉంచుతారు. అనంతరం మూడుసార్లు వరకు తిరిగి సందర్శించి నింపిన ఫారాన్ని సేకరిస్తారు. అవసరమైతే ఫారాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని నింపి అప్‌లోడ్‌ చేయడంతో పాటు బీఎల్‌వోకు కూడా అందజేయవచ్చు.

జూలై 21న ముసాయిదా జాబితా

జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులను సెప్టెంబర్‌ 18లోపు పరిశీలించి పరిష్కరిస్తారు. ముసాయిదా జాబితా విడుదల అనంతరం వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నవారికి లేదా అనుసంధానం కాని వ్యక్తులకు ఓటరు నమోదు అధికారి నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత వ్యక్తులకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.

మ్యాపింగ్‌ పూర్తికాకపోతే ఇబ్బందులు

ప్రతి ఓటరు వివరాలు మ్యాపింగ్‌ కావాల్సి ఉంటుంది. మ్యాపింగ్‌ పూర్తి కాని వారు సంబంధిత బీఎల్‌వోను సంప్రదించి తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. అనంతరం బీఎల్‌వో ఇచ్చే ఫారాన్ని పూర్తిగా నింపి తిరిగి సమర్పించాలి. జిల్లాలో ప్రస్తుతం 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 12,76,527 మంది (63.10 శాతం) మ్యాపింగ్‌ పూర్తిచేసుకున్నారు. ఇంకా 7,46,482 మంది (37.90 శాతం) మ్యాపింగ్‌ కావాల్సి ఉంది. మ్యాపింగ్‌ పూర్తి కాని ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఓటర్ల తొలగింపుపైనా చర్చ

సర్‌ ప్రక్రియలో భాగంగా చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారు, చిరునామా మారిన వారు లేదా గుర్తించలేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. అయితే ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే అర్హులైన సజీవ ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత జాబితాలో కనీసం 10 శాతం వరకు ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 20,22,581 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలు సక్రమంగా నమోదు అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

ఫారం–2 నింపడం సవాలే

సర్‌ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్‌ ఫారం–2ను పూరించి సమర్పించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, కూలీ పనులకు వెళ్లే కార్మికులు, వృద్ధులకు ఈ ప్రక్రియ కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సమయానికి ఫారం అందకపోవడం, సరైన సమాచారం నింపకపోవడం లేదా బీఎల్‌వోను సంప్రదించకపోవడం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు కూడా జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ మొత్తం పోలింగ్‌ స్టేషన్లు మ్యాపింగ్‌. పూర్తి ఇంకా పెండింగ్‌

భీమిలి 3,67,486 361 2,42,954 1,24,532

తూర్పు 2,92,227 282 1,91,522 1,00,705

దక్షిణ 2,17,795 236 1,62,104 55,691

ఉత్తర 2,84,341 272 1,96,346 87,995

పశ్చిమ 2,13,890 221 1,37,239 76,651

గాజువాక 3,34,768 309 2,45,132 89,636

పెందుర్తి 3,12,502 299 2,15,013 97,489

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement