విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. వర్సిటీలో అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తుండటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఏయూ ఉద్యోగులే బ్రోకర్లుగా మారి నిరుద్యోగులను నట్టేట ముంచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయంలో అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, రూ.లక్షలు వసూలు చేసి, చేతిలో నకిలీ నియామక పత్రాలు పెట్టడం కలకలం రేపుతోంది. కొందరు అవినీతి తిమింగలాల వల్ల ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం పరువు బజారున పడుతోంది.
రిజిస్ట్రార్ సంతకమే ఫోర్జరీ!
ఉద్యోగాల పేరిట జరిగిన ఈ దందాలో మోసగాళ్లు ఏకంగా రిజిస్ట్రార్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఏయూ పేరుతో ఉన్న నియామక పత్రాలపై రిజిస్ట్రార్ సంతకం ఉండటాన్ని చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన నిరుద్యోగులు ప్రస్తుతం ఏయూ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వారు తెచ్చిన నకిలీ నియామక పత్రాలను చూసి ఏయూ ఉన్నతాధికారులు నోట మాట రాక నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
స్కాం వెనుక వర్సిటీ అధికారి?
ఈ నకిలీ నియామక పత్రాల స్కాం వెనుక ఏయూకు చెందిన ఒక కీలక అధికారి చక్రం తిప్పినట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి బయటి వ్యక్తులతో మధ్యవర్తిత్వం నడిపిస్తూ నిరుద్యోగులకు వల వేసినట్లు తెలుస్తోంది. వర్సిటీతో సంబంధాలున్న కొందరు బయటి వ్యక్తులను లూప్‌లోకి తీసుకుని, ఈ భారీ ఉద్యోగాల భర్తీ స్కామ్‌కు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ ముఠా వలలో చిక్కి ఎంతమంది నిరుద్యోగులు మోసపోయారనేది పూర్తిస్థాయి విచారణలో తేలాల్సి ఉంది.
కఠిన చర్యలు తప్పవు
నకిలీ నియామక పత్రాల వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు స్పందించారు. విశ్వవిద్యాలయానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తే ఎంతటివారైనా సరే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోస్టుకు రూ.5 లక్షలు!
అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 30 మంది నిరుద్యోగులను ఈ ముఠా మోసం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు డిమాండ్ చేయగా.. అభ్యర్థులు తొలి విడతగా రూ.2 లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన సొమ్మును విధుల్లో చేరిన తర్వాత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైనా నియామక పత్రాలు ఇవ్వకపోవడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో.. మోసగాళ్లు రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ నియామక పత్రాలను చేతిలో పెట్టారు. వాటితో వర్సిటీకి రాగా.. అవి నకిలీవని తేలడంతో బాధితులు లబోదిబోమంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. వర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే బ్రోకర్లు ఇంతలా రెచ్చిపోతున్నారని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి అధికారుల లీలలపై ఏయూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి.


