కొమ్మాది: అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా.. శుక్రవారం రుషికొండ బీచ్‌లో యోగా వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, పిల్లల మానసిక ఎదుగుదలకు యోగా ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో మంచి ఆరోగ్యానికి యోగా ఒక ఔషధంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. జూన్ 15న ముడసర్లోవ గోల్ఫ్ కోర్స్‌లో, జూన్ 21న ఆర్‌కే బీచ్‌లో ప్రధాన వేడుకలు జరగనున్నాయని, ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీవో సంగీత్ మాధుర్, జిల్లా టూరిజం అధికారి జె.మాధవి, ఇతర అధికారులు, ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు.


