మధురవాడ: ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్ (ఐఐసీఎఫ్) మెగా షాపింగ్ ఫెస్టివల్ శుక్రవారం మధురవాడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని వైజగ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ మొదటి రోజే వినియోగదారుల సందడితో కళకళలాడింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు స్కోడా, మహీంద్రా, మారుతీ అరీనా, మారుతి నెక్సా, హెమ్ మోటార్స్, టీవీఎస్, హార్లీ డేవిడ్సన్ వంటి బ్రాండ్లు ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. పండగ రాయితీలు, ఎక్ఛేంజ్ బోనస్‌లు, ప్రత్యేక ఆఫర్లతో ఈ స్టాల్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. హోమ్ ఫర్నీచర్‌పై 60 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారు. రూ.10 వేలకు పైగా కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతి రోజూ ఒక విజేతకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను బహుమతిగా అందించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఉమేష్‌పాండే, కులదీప్‌కాల్ కోరారు.


