ఓటర్ల జాబితా సవరణకు పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణకు పార్టీలు సహకరించాలి

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

● ప్రతి బూత్‌ పరిధిలో బీఎల్‌ఏను నియమించాలి ● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

మహారాణిపేట: జిల్లాలో ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలన్నీ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా, అదే సమయంలో అనర్హులెవరూ జాబితాలో లేకుండా చూడాలన్నదే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమన్నారు. 23 సంవత్సరాల తర్వాత ఎన్నికల సంఘం సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టిందని, ఈ క్రతువు విజయవంతానికి రాజకీయ పార్టీల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతి రాజకీయ పార్టీ తమ తరఫున ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను తప్పనిసరిగా నియమించాలని సూచించారు. సదరు బీఎల్‌ఏ ఆ బూత్‌ పరిధిలోగానీ లేదా ఆయా నియోజకవర్గంలో గానీ ఓటరుగా నమోదై ఉండాలని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ బీఎల్‌ఏలను, ప్రభుత్వ బూత్‌ లెవెల్‌ అధికారులను (బీఎల్‌వో) అనుసంధానం చేస్తామని, జూన్‌ 2వ తేదీలోగా బీఎల్‌ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఓటర్ల నవీకరణలో భాగంగా ప్రతి ఇంటికీ బీఎల్‌వో స్వయంగా వచ్చి ఎన్యూమరేషన్‌ ఫారమ్‌ ఇస్తారని, ఒకవేళ బీఎల్‌వో వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే, సదరు గృహాన్ని మూడుసార్లు సందర్శిస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ జి.విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement