గ్రేటర్‌ విశాఖ గర్జన | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ విశాఖ గర్జన

May 19 2026 1:22 AM | Updated on May 19 2026 1:22 AM

ఏపీలోనే అతి పెద్ద కార్పొరేషన్‌గా జీవీఎంసీ

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ సరికొత్త రూపం దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అత్యంత భారీ, అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా జీవీఎంసీ అవతరించబోతోంది. నగర రూపురేఖలను సమూలంగా మార్చేలా, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న 98 వార్డులను ఏకంగా 120 వార్డులుగా పెంచుతూ జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ముసాయిదాను సిద్ధం చేశారు.

వైఎస్‌ఆర్‌ హయాంలో ‘గ్రేటర్‌’గా..

గతంలో 72 వార్డులుగా ఉన్న విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ‘గ్రేటర్‌’గా మార్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు ఈ వార్డుల సంఖ్య 98కి పెరిగింది. మారుతున్న జనాభా, నగర విస్తరణను పరిగణనలోకి తీసుకుని, తాజాగా 120 వార్డుల పునర్విభజన నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీని పది జోన్లుగా ఇటీవలే విభజించారు. ఇప్పుడు ఈ జోన్ల పరిధిలో వార్డుల సంఖ్య కూడా పెరగనుంది. ఇందులో ఉత్తర జోన్‌ 20 వార్డులతో అత్యంత పెద్ద జోన్‌గా అవతరించనుంది.

24లోగా అభ్యంతరాలు

వార్డుల సరిహద్దుల పూర్తి వివరాలతో కూడిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సోమవారం నుంచి ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, నగరంలోని 10 జోనల్‌ కార్యాలయాలు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారిక వెబ్‌సైట్‌ https:// www.gvmc.gov.inలో కూడా ముసాయిదాను ఉంచారు. ఈ విభజనపై ప్రజలు, వివిధ వర్గాల వారు తమ సూచనలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీలోగా లిఖితపూర్వకంగా కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

జోన్ల వారీగా 120 వార్డుల విభజన

వివరాలు ఇలా..

● ఉత్తర జోన్‌: గ్రేటర్‌ పరిధిలోనే 20 వార్డులతో అత్యంత పెద్ద జోన్‌గా అవతరించనుంది. (వార్డులు: 46 నుంచి 65)

● గాజువాక జోన్‌: 19 వార్డులతో గ్రేటర్‌ పరిధిలో రెండో అత్యధిక వార్డులున్న జోన్‌గా నిలవనుంది. (వార్డులు: 83 నుంచి 101)

● తూర్పు జోన్‌: 18 వార్డులతో నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. (వార్డులు: 12 నుంచి 29)

● పశ్చిమ జోన్‌: 17 వార్డులతో విస్తరించనుంది. (వార్డులు: 66 నుంచి 82)

● దక్షిణ జోన్‌: పాతనగరం, తీరప్రాంత పరిధిలోని 16 వార్డులతో ఏర్పడనుంది. (వార్డులు: 30 నుంచి 45)

● మధురవాడ జోన్‌: ఐటీ కారిడార్‌ పరిధిలో మొత్తం 7 వార్డులతో ఉండనుంది. (6, 7, 8, 9, 10, 11తో పాటు కొత్తగా 120వ వార్డు).

● పెందుర్తి జోన్‌: నగర శివారు ప్రాంతమైన పెందుర్తి పరిధి 7 వార్డులుగా మారనుంది. (వార్డులు: 113 నుంచి 119).

● అనకాపల్లి జోన్‌: గతంలో ఉన్న 2 వార్డులకు అదనంగా మరో 4 వార్డులు తోడై, మొత్తం 6 వార్డులతో బలోపేతం కానుంది. (వార్డులు: 107 నుంచి 112).

● భీమునిపట్నం జోన్‌: చారిత్రక భీమిలి పరిధిలో 5 వార్డులు ఉంటాయి. (వార్డులు: 1 నుంచి 5)

● అగనంపూడి జోన్‌: కొత్తగా ఏర్పడిన ఈ జోన్‌ 5 వార్డులతో ఉండనుంది. (వార్డులు: 102, 103, 104, 105, 106).

98 నుంచి 120కి పెరగనున్న వార్డుల సంఖ్య

10 జోన్ల పరిధిలో వార్డుల

పునర్విభజన ముసాయిదా సిద్ధం

అత్యధికంగా ఉత్తర జోన్‌లో 20,

గాజువాకలో 19 వార్డులు

24 వరకు అభ్యంతరాల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement