మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం దళిత రీసెర్చ్ స్కాలర్లపై జరుగుతున్న వేధింపులు, వివక్షను సహించేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ హెచ్చరించారు. ఏయూ రీసెర్చ్ స్కాలర్లపై వేధింపుల వివాదంపై దళిత హక్కుల పోరాట సమితి, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రతినిధుల బృందం సోమవారం ఏయూలో నిజనిర్ధారణ జరిపింది. ఈ సందర్భంగా బాధిత అంబేద్కర్ చైర్ ఫెలోషిప్ స్కాలర్లు ప్రవీణ్ కుమార్, రాజ్ కుమార్‌లను కలిసి వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జె.వి.ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గత 14 నెలలుగా ఇద్దరు దళిత స్కాలర్లను వర్సిటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. యూజీసీ నుంచి గ్రాంట్ వచ్చినప్పటికీ వీరికి నిధులు విడుదల చేయకుండా వేధించారని, ఈ విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే నిధులు విడుదలయ్యాయని గుర్తుచేశారు. నిధులు ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వడంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ చైర్ విలువలను కాపాడటంలో విఫలమైన ఆర్ అండ్ డీ డీన్ ప్రొఫెసర్ వల్లి కుమారిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏయూ గౌరవాన్ని వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ తన నిర్ణయాలతో దిగజార్చుతున్నారని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సైతం దళిత ప్రముఖులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బి.కల్యాణ్‌రావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సామరాజులు తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీలో దళిత హక్కుల
పోరాట సమితి నిజనిర్ధారణ


