బాలికలదే పైచేయి | - | Sakshi
Sakshi News home page

బాలికలదే పైచేయి

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

రాష్ట్రంలో జిల్లాకు ఏడో స్థానం

అగ్రస్థానంలో అంధ బాలుర, బాలిక పాఠశాలలు

అట్టడుగున ప్రభుత్వ బడులు

ఆరిలోవ: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఉత్తీర్ణతలో జిల్లాలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. బాలురతో పోలిస్తే బాలికలు సుమారు 3 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి ముందు నిలిచారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం విద్యాశాఖ ఫలితాలను విడుదల చేయగా.. జిల్లాలో మొత్తం 89.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి ఈ విద్యా సంవత్సరంలో 28,929 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 25,894 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు హాజరైన 15,258 మంది బాలురులో 13,418 మంది(87.94 శాతం) ఉత్తీర్ణులు కాగా, 13,671 మంది బాలికలకు గాను 12,476 మంది(91.26 శాతం) పాసయ్యారు. దీంతో బాలురు కంటే బాలికలు 3.32 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు.

అత్యధికంగా ప్రథమ శ్రేణిలోనే..

జిల్లాలో పాసైన 25,894 మంది విద్యార్థుల్లో అత్యధికంగా 22,977 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ శ్రేణిలో 2,141 మంది, తృతీయ శ్రేణిలో 776 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. శ్రీ చైతన్యకు చెందిన విద్యార్థిని కె.జ్ఞానేశ్వరి 599/600 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.

ప్రభుత్వ పాఠశాలల టాపర్లు వీరే..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించి సత్తా చాటారు. గాజువాక సమీపంలోని నడుపూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇమంది దేవిక (592/600), నరవ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి శానాపతి పునీత్‌కుమార్‌ (592) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో టాపర్లుగా నిలిచారు. గోపాలపట్నం (బాలికల) జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎ.స్రవంతి (591), అక్కిరెడ్డిపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని వి.శివసాయి అదితి (591), గాజువాక జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని సీహెచ్‌.దుర్గాశ్రీవల్లి (590), వేపగుంట జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని కె.రామతులసి (590), అగనంపూడి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినులు ఎం.హర్షిత నాగభువన (590), సీహెచ్‌.మణిశ్రీ (590) ప్రతిభ కనబరిచారు. ఉత్తర నియోజకవర్గంలోని మధురానగర్‌ జీవీఎంసీ హైస్కూల్‌కు చెందిన పద్రపాక చరణ్‌ కుమార్‌ 585 మార్కులు సాధించి జీవీఎంసీ పరిధిలో టాపర్‌గా నిలిచాడు. గురుకుల పాఠశాలల పరిధిలో సింహాచలం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన ఎన్‌బీవీ శైలేష్‌ 590 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు : పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుంచి జూన్‌ 4 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో ఫీజు చెల్లించలేని వారు రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 10 నుంచి 25వ తేదీ లోపు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌ కోసం సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఈ నెల 1 ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 11 గంటల వరకు ప్రధానోపాధ్యాయుల ద్వారా చెల్లించాలి.

జిల్లాకు ఏడో స్థానం

ఈ విద్యా సంవత్సరం(2025–26) పదో తరగతి ఫలితాల్లో 89.51 శాతం ఉత్తీర్ణత సాధించిన విశాఖ జిల్లా.. రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. గత నాలుగేళ్లుగా జిల్లాలో ఉత్తీర్ణత శాతం పరిశీలిస్తే..

విద్యా సంవత్సరం ఉత్తీర్ణత రాష్ట్రంలో శాతం స్థానం

2022–23 82.68 3

2023–24 91.15 8

2024–25 89.14 3

2025–26 89.51 7

విద్యాసంస్థ ఉత్తీర్ణత శాతం

బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలు 97.25

కేజీబీవీలు 96.64

ఏపీఆర్‌ఈఐ సొసైటీ స్కూల్స్‌ 96.30

ప్రైవేట్‌ అన్‌–ఎయిడెడ్‌ స్కూల్స్‌ 95.42

ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ

సొసైటీ స్కూల్స్‌ 92.69

అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 90

ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 84.22

ఏపీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఈఐ

సొసైటీ స్కూల్స్‌ 80.56

జెడ్పీ ఉన్నత పాఠశాలలు 77.64

మున్సిపల్‌ పాఠశాలలు 73.93

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 69.29

విద్యా సంస్థల వారీగా ఫలితాలు

ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు కలిపి సగటున 89.51 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పాఠశాలల వారీగా ఉత్తీర్ణత వివరాలు పరిశీలిస్తే.. ప్రభుత్వ అంధబాలల పాఠశాలలు, ప్రైవేట్‌ అన్‌–ఎయిడెడ్‌ అంధ బాలల పాఠశాలలు, ప్రైవేట్‌ అన్‌–ఎయిడెడ్‌ డెఫ్‌ అండ్‌ డంబ్‌ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి టాప్‌లో నిలిచాయి.

టెన్త్‌ ఫలితాల్లో

89.51శాతం ఉత్తీర్ణత

Advertisement
 
Advertisement
Advertisement