వర్సిటీ వికృత క్రీడ | - | Sakshi
Sakshi News home page

వర్సిటీ వికృత క్రీడ

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

● పరీక్షల వేళ హాల్‌టికెట్ల కోసం పడిగాపులు ● ఏయూ ఆచార్యుల తీరుపై సర్వత్రా ఆగ్రహం

విశాఖ సిటీ : అది వందేళ్ల చరిత్ర గల విద్యా దేవాలయం. దేశ విదేశాల్లో వేల మంది మేధావులను తీర్చిదిద్దిన ఘనత ఆ యూనివర్సిటీ సొంతం. కానీ నేడు అక్కడ విద్యార్థుల భవిష్యత్తుతో ఆచార్యులే చెలగాటమాడుతున్నారు. పరీక్షల టెన్షన్‌తో పుస్తకాలు తిరగేయాల్సిన విద్యార్థులు.. హాల్‌టికెట్ల కోసం అల్లాడుతూ కంటతడి పెడుతున్నారు. విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తూ ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో సాగుతున్న ఈ ‘వికృత క్రీడ’ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

హాల్‌టికెట్‌ కోసం ముప్పుతిప్పలు’

శుక్రవారం నుంచి బీటెక్‌ (సెమిస్టర్‌ 2, 3) పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, గురువారం రాత్రి వరకు విద్యార్థులకు హాల్‌టికెట్లు అందకపోవడం వర్సిటీ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. హాల్‌టికెట్ల కోసం వెళ్లిన వందలాది మంది విద్యార్థులను గంటల తరబడి మండుటెండలో నిలబెట్టి, చిన్న చిన్న కారణాలతో వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ‘శుక్రవారం పరీక్ష పెట్టుకుని, గురువారం హాల్‌టికెట్ల కోసం బతిమిలాడాల్సి రావడం తమ దౌర్భాగ్యం.. హెచ్‌వోడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనికరం చూపడం లేద’ని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆచార్యుల ఆగడాలు.. తల్లిదండ్రుల ఆగ్రహం

పరీక్షల షెడ్యూల్‌ మార్పుపై స్పష్టత ఇవ్వకపోగా, పాత షెడ్యూల్‌ ప్రకారం వచ్చిన విద్యార్థులకు ఆచార్యులు చుక్కలు చూపించారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడం, వారిని భయపెట్టడం వంటి చర్యలతో ప్రాంగణంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసి తల్లిదండ్రులు సైతం యూనివర్సిటీ గేట్ల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న సాంకేతిక కారణాలు సాకుగా చూపి చివరి నిమిషం వరకు వేచి చూసేలా చేయడం.. ఉన్నతాధికారులు ఉత్సవాల హడావుడిలో ఉండగా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన సమయంలో విద్యార్థులను కన్నీరు పెట్టించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.

చర్యలు ఎప్పుడో?

వందేళ్ల పండుగ చేసుకున్న గడ్డపై విద్యార్థులకు ఇలాంటి అవమానం జరగడం సిగ్గుచేటు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంతో పాటు ఇతర విభాగాధిపతులపై వర్సిటీ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement