మహారాణిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ తొలిసారిగా జిల్లాలో పర్యటించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని బృందం గురువారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఇతర ఉన్నతాధికారులు, బీసీ సంఘాల నేతలతో కలెక్టరేట్‌లో సమావేశమైంది. అనంతరం చైర్మన్ వినతులు స్వీకరించి, వారి సూచనలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా బట్రాజు సామాజిక వర్గానికి రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆ వర్గానికి చెందిన ప్రతినిధి ఎన్.రాజీవ్ కుమార్ కోరారు. సామెతల ద్వారా తమను హేళన చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమను ఎస్సీ జాబితా లో చేర్చాలని నాయీ బ్రాహ్మణ ప్రతినిధి కోట నరేశ్ విన్నవించారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం ఐదు వార్డుల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కళింగ కార్పొరేషన్ ప్రతినిధి కోరారు. నాగవంశం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బుగత నరసింగరావు, ప్రధా న కార్యదర్శి నింగిబోతు జనార్ధనరావు మాట్లాడుతూ.. బీసీ–డీ జాబితాలో ఉన్న తమను బీసీ–ఏ జాబితాలోకి మార్చాలని కోరారు. ఆలయాల్లో వాయిద్యం వాయించే అవకాశం కల్పించాలని, తమను నాయీ బ్రాహ్మణులుగా సంబోధించాలని ముసిడిపల్లి రమణ విజ్ఞప్తి చేశారు. తమను బీసీ–బీ నుంచి బీసీ–ఏ జాబితాకు మార్చాలని విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధి బోడి నరసింహాచారి, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కళింగ వైశ్య సంఘ ప్రతినిధి కోరాడ రాజారావు కమిషన్‌ను కోరారు.
డేటా మ్యాపింగ్ పక్కాగా ఉండాలి
పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో బీసీ కులాలకు సంబంధించి సేకరించే డేటా మ్యాపింగ్ పక్కాగా ఉండాలని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎటువంటి తారతమ్యా లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సెన్సస్ ప్రక్రియలో బీసీ కులాల సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. గత ఎన్నికల్లో బీసీ కులాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, విశాఖ, అనకాపల్లి బీసీ వెల్ఫేర్ అధికారులు రాజేశ్వరి, శ్రీదేవి, సీపీవో శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఉపకులాల వినతుల వెల్లువ


