పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలి

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

మహారాణిపేట: జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి ప్రక్రియలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో పారిశ్రామిక రంగంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తుంగ్లాం ప్రాంతంలోని ఏపీఐఐసీ భూమికి రైల్వే అండర్‌పాస్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, గంగవరం పోర్ట్‌ నుంచి జాతీయ రహదారికి రోడ్డు అనుసంధానానికి అవసరమైన అనుమతులను 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆటోనగర్‌, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో బస్‌ స్టాప్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించాలని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూముల గుర్తింపు, నీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి పనులను ఆలస్యం లేకుండా చేపట్టాలని ఆదేశించారు. ఆటోనగర్‌లో ఆర్‌ అండ్‌ బీ పనులను గడువులోగా పూర్తి చేయాలని, పైప్‌లైన్‌ మార్పిడి పనులను వెంటనే పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్‌ పార్కులకు ఐఏఎల్‌ఏ హోదా మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా అనుమతులను త్వరగా మంజూరు చేయాలని, పీఎం విశ్వకర్మ యోజన అమలులో లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆదిశేషు, ఏపీఐఐసీ జోన్‌ మేనేజర్‌ సింహాచలం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement