విధులకు వెళ్తుండగా విషాదం | - | Sakshi
Sakshi News home page

విధులకు వెళ్తుండగా విషాదం

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

బైక్‌ షోరూమ్‌ ఉద్యోగి మృతి

పెందుర్తి: బీఆర్‌టీఎస్‌ రహదారిలోని పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. సాలూరుకు చెందిన ఎం.పోలిరాజు (45) చినముషిడివాడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన పెందుర్తిలోని ఒక బైక్‌ షోరూమ్‌లో ఆడిట్‌ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై చినముషిడివాడ నుంచి పెందుర్తి బయలుదేరారు. ప్రభుత్వ కళాశాల దాటిన తర్వాత చర్చి సమీపంలోకి వచ్చేసరికి బైక్‌ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న లక్ష్మణ్‌ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలిరాజు వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలిరాజుకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉన్నారు. పెందుర్తి సీఐ కె.వి. సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విధి నిర్వహణ కోసం ఉత్సాహంగా ఇంటి నుంచి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. మంగళవారం సబ్బవరం, పెందుర్తి మండలాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు పంచాయతీ స్వీపర్‌ కాగా, మరొకరు షోరూమ్‌ ఉద్యోగి. విధులకు వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.

పంచాయతీ స్వీపర్‌ మృతి

సబ్బవరం: మండలంలోని గొల్లలపాలెం శివారు అమరపిన్నివానిపాలేనికి చెందిన కొమ్ము దుర్గాలు (65) బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుర్గాలు గొల్లలపాలెం పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆయన కాలినడకన బయలుదేరారు. అదే సమయంలో పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గణేష్‌ తన ద్విచక్ర వాహనంపై కూర్మన్నపాలెం వెళ్తుండగా.. దుర్గాలు లిఫ్ట్‌ అడగడంతో అతడిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఒక మలుపు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన బోలెరో వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, దుర్గాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ నడుపుతున్న గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బోలెరో వాహనం డ్రైవర్‌ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆ వాహనం నంబర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుర్గాలుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

పోలిరాజు మృతదేహం, గాయపడ్డ లక్ష్మణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement