మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 44 వినతులు అందాయి. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరాలో లో–వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ లైన్ల మార్పు, కొత్త కనెక్షన్ల మంజూరులో జాప్యం, విద్యుత్ బిల్లుల సవరణ, పాత ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు తదితర సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. వినియోగదారులు తమ సమస్యలను విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం ద్వారా గానీ, లేదా వాట్సాప్ నంబర్ 9493681912కు మేసేజ్ పంపడం ద్వారా తెలియజేయవచ్చని సూచించారు.


