న్యూజిలాండ్‌లో ఉద్యోగాల పేరిట మోసం | - | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌లో ఉద్యోగాల పేరిట మోసం

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

● బాధితుల నుంచి రూ.70లక్షల మేర వసూలు ● కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ను ఆశ్రయించిన బాధితులు

అల్లిపురం : న్యూజిలాండ్‌లో వెల్డర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి గాజువాకకు చెందిన ఒక కుటుంబం తొమ్మిది మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి మొత్తం సుమారు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు సోమవారం నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చిని పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలిసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..ం గాజువాక చినగంట్యాడకు చెందిన కర్రి శివశంకర్‌ గతంలో న్యూజిలాండ్‌లో వెల్డర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఒకసారి విశాఖపట్నానికి వచ్చినప్పుడు, అతని కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిరుద్యోగులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించారు. శివశంకర్‌ తల్లిదండ్రులు రామునాయుడు, బొజ్జలమ్మ, బావ డి.శ్రీహరి (ఫైనాన్సర్‌)తో పాటు కుటుంబ సభ్యులు చిన్ని, మణి కలిసి పలువురిని సంప్రదించి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఒమ్మి త్రిమూర్తులు, గెంజి గంగాధర్‌, కర్రి గౌరీశంకర్‌, పైల రాము, రోగలు శివప్రసాద్‌, బండి సురేష్‌కుమార్‌, షేక్‌ అమీర్‌, సిరసపల్లి అశోక్‌, సమ్మిడి మహేష్‌ తదితరులు ఒక్కొక్కరు రూ.7 లక్షలు చొప్పున చెల్లించారు. డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగాలు కల్పించకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితులు పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయించగా, ఆయన ఆదేశాల మేరకు గాజువాక పోలీసులను సంప్రదించారు. అయితే గాజువాకకు చెందిన మరో వ్యక్తి ‘సమస్యను పరిష్కరిస్తాను’ అంటూ నిందితుల నుంచి పత్రాలు తీసుకుని, అతడూ మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. డీసీపీ, సౌత్‌ ఏసీపీ, గాజువాక సీఐలను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ నిందితులు పట్టుబడకుండా తిరుగుతున్నారని బాధితులు వాపోయారు. ఫోన్‌లో సంప్రదించినా ‘మాకు పోలీసులు కొత్తేమీ కాదు, డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇస్తాం, లేదంటే లేదు’ అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. న్యూజిలాండ్‌లో ఉన్న కర్రి శివశంకర్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయడంతో పాటు, అతని కుటుంబ సభ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీస్‌ కమిషనర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement