మహారాణిపేట : సెంట్రల్ పార్క్ సమీపంలో ఏడు నెలల క్రితం తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃప్రారంభించాలని విశాఖ తోపుడు బండ్లు చిల్లర వర్తకుల కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎ.సింహాచలం కోరారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 150 మంది వీధి విక్రయదారులు ఈ ఫుడ్ కోర్ట్‌పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 19న ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫుడ్ కోర్ట్‌ను అకస్మాత్తుగా తొలగించడం వల్ల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జోన్–4 జోనల్ కమిషనర్ పది రోజుల్లో అర్హులను గుర్తించి ఫుడ్ కోర్ట్‌ను తిరిగి ఏర్పాటు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జోనల్ వెండింగ్ కమిటీ ఆధ్వర్యంలో 97 మంది అర్హుల జాబితా విడుదలైనప్పటికీ, ఇంకా 31 మంది అర్హులు జాబితాలో చేరలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రికార్డుల్లో గతంలో అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ ఉన్నట్టు నమోదు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. అలాగే, గతంలో ఏసీబీ కేసులో పట్టుబడిన ఉద్యోగిని కలెక్టరేట్‌లో నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లో ఫుడ్ కోర్ట్‌ను తిరిగి ప్రారంభించకపోతే.. తోపుడు బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకుడు కె.చంద్రశేఖర్, అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్, ఎం.ప్రసాద్, కార్యదర్శి ఎం.లలిత కుమారి, సభ్యులు, ఫుడ్ కోర్ట్ వ్యాపారులు పాల్గొన్నారు.


