ఏయూక్యాంపస్: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ విద్యాధరి మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా దేశాభివృద్ధికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలోని కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, వసతి గృహాల్లోనూ వేడుకలు నిర్వహించి విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


