ఉరితాళ్లతో వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉరితాళ్లతో వినూత్న నిరసన

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

11వ రోజుకు చేరుకున్న నైట్‌ ఫుడ్‌ కోర్ట్‌ వ్యాపారుల నిరసన

బీచ్‌రోడ్డు: నగరంలోని సెంట్రల్‌ పార్క్‌ సమీపంలో ఉన్న నైట్‌ ఫుడ్‌ కోర్టును పునఃప్రారంభించాలంటూ వ్యాపారులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఫుడ్‌ కోర్టు మహిళా వ్యాపారులు మెడకు ఉరితాళ్లు వేసుకుని తమ గోడును వెళ్లబోసుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల్లో వ్యాపారులు

గత ఏడు నెలలుగా ఫుడ్‌ కోర్టు మూతపడటంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రా లోన్లు, పీఎం స్వానిధి పథకం కింద తీసుకున్న రుణాలను కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితికి చేరుకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. దక్షిణ నియోజకవర్గంలో ఎంతో ఆదరణ పొందిన ఈ నైట్‌ ఫుడ్‌ కోర్టును తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

ప్రభుత్వం స్పందించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సెంట్రల్‌ పార్క్‌ ఫుడ్‌ ట్రక్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. గతంలో మాదిరిగానే సెంట్రల్‌ పార్క్‌ వద్ద నైట్‌ ఫుడ్‌ కోర్టును నిర్వహించుకునేలా జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు కె. శ్రీకాంత్‌, ఎం. ప్రసాద్‌, కార్యదర్శి ఎం. లలిత కుమారి, సభ్యులు దుంగ శ్రీను, బొగ్గు శ్యామ్‌, లక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement