సబ్బవరం: మండలంలోని రావలమ్మపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కర్రి సందీప్ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ నెల 9, 10 తేదీల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి అండర్–14 రగ్బీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు సందీప్ ఎంపికయ్యాడు. గ్రామీణ ప్రాంత పాఠశాల నుంచి జాతీయ స్థాయికి ఎంపికవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. అరుణ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయుడు కె. గోవిందరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సబ్బవరపు కృష్ణ, గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవింద్ సందీప్‌ను అభినందించారు. క్రీడల్లో క్రమశిక్షణతో రాణించి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.


