ఉక్కునగరం: మెడికల్ ఇన్సూరెన్స్ పాత పద్ధతిలో అమలు చేయాలంటూ స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఏడాది మార్చి మొదటి వారంలో మెడికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం జారీ చేసే సర్క్యులర్‌ను, నెలాఖరు అవుతున్నా జారీ చేయకపోవడంతో యాజమాన్య వర్గాలను సంప్రదించారు. అయితే, యాజమాన్యం ప్రీమియం చెల్లింపులో రిటైర్డ్ ఉద్యోగులపై భారం పెంచుతున్నట్టు తెలియడంతో యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా చేశారు. ధర్నాలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాజమాన్యం వైఖరిని నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్లాంట్ కోసం శ్రమించి, వ్యాధుల బారిన పడ్డ ఉద్యోగుల ఇన్సూరెన్స్‌పై యాజమాన్యం వైఖరి సమంజనంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాటూరి శ్రీనివాసరావు, డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, మంత్రి రాజశేఖర్, పి.వి.రమణమూర్తి, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, బొడ్డు పైడిరాజు, బూసి వెంకటరావు, కర్రి దాలినాయుడు, రామ్మోహన్‌కుమార్, దొమ్మేటి అప్పారావు, ఎన్.బాలభాస్కరరావు, డేవిడ్, మహాలక్ష్మినాయుడు, సన్యాసిరావు, పరంధామయ్య, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం అందజేసేందుకు అంగీకరించకపోవడంతో వినతిపత్రాన్ని గేటు బయట ఉన్న బారికేడ్లకు అతికించి తమ నిరసన తెలియజేశారు.
మెడికల్ ఇన్సూరెన్స్ కోసం పోరాటం
యాజమాన్యం కొత్త ప్రతిపాదనలు
అనంతరం యాజమాన్యంతో జరిపిన చర్చల్లో యాజమాన్యం కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే రిటైర్‌మెంట్ సభ్యులు 20,924 మందికి చేరుకున్నందున ప్రీమియం చెల్లింపు కంపెనీకి భారంగా ఉందన్నారు. కొత్త ప్రతిపాదన మేరకు 90 ఏళ్లు పైబడిన వారికి పాత పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తామని, 80–90 ఏళ్లు మధ్య వారికి యాజమాన్యం 80 శాతం, సభ్యులు మిగిలిన 20 శాతం చెల్లించాలని, 70–80 ఏళ్లు మధ్య వారికి 70–30 శాతం, 60–70 మధ్య వారికి 60–40 శాతం చెల్లించాలని ప్రతిపాదించింది. దీనిని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పాత పద్ధతి కొనసాగించాలని, లేనిపక్షంలో జరగనున్న పరిణామాలకు యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.


