మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 91వ, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఇప్పటికే పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పూలతో అలంకరించిన వేదిక, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రాంగణం, శ్రద్ధగా అమర్చిన సీటింగ్.. ఇవి అన్నీ కలిపి విద్యార్థులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పట్టాలు అందుకునే విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశేషం. వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానుండటం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొననున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుండటం విశేషం. అదేవిధంగా సాహిత్య రంగంలో విశిష్ట సేవలందించిన తల్లావజ్‌ఝల పతంజలి శాస్త్రికి కూడా గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. ఇద్దరు ఆచార్యులకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు, పీహెచ్‌డీ విద్యార్థులకు 17 రీసెర్చ్ మెడల్స్, 13 రీసెర్చ్ ప్రైజ్‌లు అందజేస్తారు. మొత్తం 441 మంది పీహెచ్‌డీ డిగ్రీలు, 7 మంది ఎం.ఫిల్ డిగ్రీలు అందుకుంటారు. యూజీ, పీజీ స్థాయిలో 174 మెడల్స్, 437 ప్రైజ్‌లు కూడా విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా అందించనున్నారు.


