మద్దిలపాలెం: విద్యార్థి ప్రగతికి విశ్వవిద్యాలయమే ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని ఐఐటీ ఢిల్లీ మాజీ సంచాలకుడు ఆచార్య వి.ఎస్.రాజు అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ‘జియోటెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాబ్లమేటిక్ గ్రౌండ్’అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ ఆదివారం ప్రారంభమైంది. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ (ఐజీఎస్) విశాఖ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను చదువుకున్న ఏయూలో పొందిన జ్ఞానమే నేడు తనను ఈ స్థాయిలో నిలిపిందని గుర్తుచేసుకున్నారు. ఉన్నత స్థానాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులు తమ జ్ఞానాన్ని, మేధస్సును, అనుభవాన్ని తాము చదువుకున్న విశ్వవిద్యాలయ వికాసానికి అందించి, మాతృ సంస్థకు రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో నిర్మాణ రంగంలో అనేక సాంకేతిక మార్పులు వస్తున్నాయన్నారు. సదస్సు కన్వీనర్ ఆచార్య సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక స్వభావం కలిగిన నేలల్లో చేపట్టే నిర్మాణాలపై నిపుణుల సూచనలు పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య పి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12 లక్షల కోట్లు కేటాయించడం, ఈ రంగం విస్తరణ వేగాన్ని ప్రస్ఫుటం చేస్తోందన్నారు. ఐజీఎస్ అధ్యక్షుడు డాక్టర్ అనీల్ జోసఫ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏయూతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఐజీఎస్ కార్యదర్శి ఎ.పి. సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిపుణులు ప్రత్యక్ష ఉదాహరణలతో సాంకేతిక అంశాలను వివరించారు.


