బకాయిల చిక్కుముడి..
మహారాణిపేట: నిరుపేదల ప్రాణ సంజీవనిగా వెలుగొందుతున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి చంద్రబాబు సర్కార్ ఉరి బిగిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాలుగా పేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుతున్న ఆధునిక వైద్య సేవలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
పెరిగిన వ్యాధుల సంఖ్య.. ఇప్పుడు కోత?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. దివంగత వైఎస్సార్ 1059 వ్యాధులతో ప్రారంభించిన ఈ పథకాన్ని, జగన్ ఏకంగా 3257 వ్యాధులకు విస్తరించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చి పేదలకు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఈ పథకానికి తూట్లు పొడిచేలా ‘యూనివర్సల్ హెల్త్ స్కీమ్’ పేరుతో కొత్త పాలసీని తీసుకురావడానికి సిద్ధమవుతోందన్న ప్రచారం సాగుతోంది.
వచ్చే నెల నుంచి కొత్త పాలసీ?
ఏప్రిల్ నుంచి కొత్త హెల్త్ పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పాత బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపడం, కొత్త పథకం పేరుతో ఎన్టీఆర్ వైద్యసేవను నీరుగార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల సంజీవనిగా ఉన్న ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్త పాలసీకి ప్రభుత్వం సిద్ధం నెట్‌వర్క్ ఆస్పత్రులకు పేరుకుపోయిన బకాయిలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి చంద్రబాబు సర్కార్ కుట్ర
జిల్లాలో మొక్కుబడి సేవలు
జిల్లాలో మొత్తం 108 నెట్‌వర్క్ ఆస్పత్రులు (66 ప్రైవేటు, 19 ప్రభుత్వ, 23 డెంటల్) ఉండగా, బకాయిల రాకతో ఇక్కడ సేవలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఫలితంగా పేద ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వర్కింగ్ జర్నలిస్టులు వైద్యం కోసం అల్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో పర్యవేక్షణ కూడా లోపించిందని, దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


