సాగర తీరాన ‘ప్రపంచ’ విందు ఏయూలో 40 దేశాల రుచుల హంగామా
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ వంటకాలకు వేదికై ంది. అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఫీస్ట్ ఫెస్ట్’ నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించింది. 40 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు 38 స్టాళ్లలో తమ దేశ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయగా, ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు మరో 18 స్టాళ్లలో భారతీయ స్వదేశీ రుచులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ కెప్టెన్ ఎస్. దివాకర్, ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఇథియోపియా సంప్రదాయ కాఫీ, ఆఫ్గన్ ‘కాబూలి పలావ్’, జోర్డాన్ షవర్మ, నేపాల్ మోమోస్ వంటి వంటకాలు ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. వీటితో పాటు కొమరూన్ ఇగుసి సూప్, కాంబోడియా చేపల వంటకాలు, భూటాన్ శాకాహార రుచులు విదేశీ సంస్కృతిని ప్రతిబింబించాయి. ‘థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్’ అనే నినాదంతో విభిన్న దేశాల ఆహారపు అలవాట్లను ఒకే చోట చేర్చడం అభినందనీయమని కెప్టెన్ దివాకర్ కొనియాడారు. ఏయూ వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సంప్రదాయ వస్త్రధారణలో వంటకాలను వడ్డించడం ద్వారా తమ దేశ వారసత్వాన్ని పరిచయం చేశారని తెలిపారు. ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్‌లు ఆచార్య యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య విజయమోహన్ సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫీస్ట్‌ఫెస్ట్‌లో పాల్గొన్న ఏయూ వీసీ


