27 ఏళ్ల తర్వాత ఇంటికి... | - | Sakshi
Sakshi News home page

27 ఏళ్ల తర్వాత ఇంటికి...

Mar 23 2026 7:02 AM | Updated on Mar 23 2026 7:02 AM

కన్నకొడుకును చూసి కన్నీరుమున్నీరైన తండ్రి

అల్లిపురం: ఇరవై ఏడు ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి చేరుకుంటే ఆ కుటుంబంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాంటి మధుర అనుభూతిని ఏయూటీడీ సంస్థ ప్రతినిధులు ఆ కుటుంబానికి కల్పించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం, కలహండి జిల్లా, బర్గాన్‌ గ్రామానికి చెందిన మహేందర్‌ చత్రియ గతంలో మానసిక అనారోగ్యానికి గురై ఇల్లు వదిలి వచ్చేశాడు. 2024 నవంబర్‌లో విశాఖ రైల్వే స్టేషన్‌లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న అతడిని ఏయూటీడీ సిబ్బంది గుర్తించి చేరదీశారు. ఐదు నెలలుగా ‘శ్రద్ధా’మందులతో వైద్య సేవలందించారు. చికిత్స అనంతరం మహేందర్‌ కోలుకోవడంతో, సంస్థ ప్రతినిధులు అతడిని నేరుగా సొంతూరికి తీసుకువెళ్లారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గ్రామానికి చేరుకోవడంతో అక్కడి పరిసరాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఎనిమిదేళ్ల క్రితమే మహేందర్‌ తల్లి మరణించగా, తండ్రి రాకేశ్‌ కుమార్‌ చత్రియ మాత్రం కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్లముందు నిలబడటంతో ఆ వృద్ధ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఇక నేను నిశ్చింతగా కన్నుమూస్తాను’అంటూ ఆయన అన్న మాటలు గ్రామస్తులందరినీ కదిలించాయి. మహేందర్‌ను అతని తండ్రికి, సోదరులకు క్షేమంగా అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement