భగత్‌సింగ్‌కు సీఐటీయూ
ఆధ్వర్యంలో నివాళులు
ఏయూక్యాంపస్: దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం బీచ్‌రోడ్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల మాఫియాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పెరుగుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో అధికార పార్టీకి చెందిన ఎంపీ ప్రమేయం ఉండటం ఆశ్చర్యకరమని, ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ మాఫి యా సాగుతోందని ఆరోపించారు. నెల్లూరు యువజన సంఘం కార్యకర్త పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవాలని, కార్మిక హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతరం ‘యుద్ధం వద్దు–శాంతి కావాలి’, ‘అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీ యూ నేతలు కుమార్ మంగళం, ఎం.సుబ్బారావు, కె.చంద్రశేఖర్, వి.కృష్ణరావు, పీతల అప్పారావు, అనపర్తి అప్పారావు, సింహాచలం, కుమారి, మణికుమార్, తులసీరామ్, మోహన్ రావు, రమాప్రభ తదితరులు పాల్గొన్నారు.


