పేరు వింటే వణుకు | - | Sakshi
Sakshi News home page

పేరు వింటే వణుకు

Mar 22 2026 2:07 AM | Updated on Mar 22 2026 2:07 AM

ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026

కొనసాగుతున్న కూటమి నేతల ‘అరాచక’ పర్వం

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్‌ విగ్రహాలపై దాడులు

వైఎస్సార్‌ లాన్‌, వ్యూ పాయింట్‌ వద్ద ధ్వంసరచన

తాజాగా గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి

తీవ్రంగా స్పందించిన వైఎస్సార్‌సీపీ

48 గంటల్లో దోషులను శిక్షించాలని డిమాండ్‌

మ్మడి విశాఖ జిల్లాలో విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న విగ్రహాలు, స్థలాలు లక్ష్యంగా మారడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్‌ పేరు వినగానే కూటమి నేతల్లో అసహనం వ్యక్తమవుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ఆ మహానేత జ్ఞాపకాలను ఇలా చెరిపేయాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో అధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ లాన్‌ బోర్డును తొలగించడం మొదలుకుని, జీవీఎంసీ తీర్మానంతో ఏర్పాటైన వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ వద్ద పేరు చెరిపే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా, పెందుర్తి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించే యత్నం జరిగింది. స్థానిక నేతల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తండ్రి గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ రాక్షసకాండపై వైఎస్సార్‌సీపీ గర్జించింది. 48 గంటల్లో నిందితులను పట్టుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని ‘అల్టిమేటం’ జారీ చేసింది.

అధికార గర్వం

అరాచక పర్వం

గురునాథరావు విగ్రహంపై దాడి

కూల్చివేతలే లక్ష్యంగా..

పదవి కోసం పైశాచికం

అభివృద్ధిని చూసి అసూయ

ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వికృత క్రీడ పరాకాష్టకు చేరింది. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత స్మృతులను తుడిచిపెట్టాలనే సంకుచిత బుద్ధితో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్‌ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతున్న పచ్చ దండు.. అభివృద్ధిని విస్మరించి, విగ్రహాల విధ్వంసమే ధ్యేయంగా అరాచక పర్వాన్ని కొనసాగిస్తోంది. వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌, లాన్‌ల నుంచి మొదలైన ఈ ‘అల్పబుద్ధి’ రాజకీయం.. ఇప్పుడు దివంగత నేత గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి వరకు వెళ్లింది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

పెందుర్తిలో రోడ్ల వెడల్పు సాకుతో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించేందుకు తెగబడగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి. గతంలో అనకాపల్లి జాతీయ రహదారి కొత్తూరు వద్ద చీకటి మాటున వైఎస్సార్‌ విగ్రహంపై దాడి చేశారు.

తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం వైఎస్సార్‌సీపీ నేతలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అభివృద్ధి చేయలేక, ప్రజల మద్దతు పొందలేక ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడుతున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

మంత్రి పదవి దక్కలేదన్న కసితోనో, అధినేత దృష్టిలో పడాలన్న తాపత్రయంతోనో గానీ.. గంటా అనుచరులు ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో సాగించిన రభస అంతా ఇంతా కాదు. క్లబ్‌ కమిటీ అధికారిక తీర్మానం మేరకు ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌ లాన్‌’ బోర్డును బలవంతంగా పీకేసి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి, దౌర్జన్యంతో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం కూటమి నేతల ‘కుటిల’ సంస్కృతికి నిదర్శనం.

విశాఖ జిల్లాలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచే అరాచక శక్తులు జడలు విప్పాయి. ప్రశాంతతకు మారుపేరైన సాగర తీరాన్ని రాజకీయ కక్షలకు వేదికగా మార్చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు చేతకాక, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక.. చివరకు మహనీయుల విగ్రహాలపై పడి ఏడవడం వీరి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది.

గత ప్రభుత్వ హయాంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ‘వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌’ ఇప్పుడు జనంతో కిటకిటలాడుతోంది. జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదంతో నామకరణం చేసిన ఈ ప్రాంతంపై పచ్చ నేతలు కన్నేశారు. అధికారికంగా మార్చే దమ్ము లేక, రాత్రికి రాత్రే పేరును తొలగించేందుకు విఫలయత్నం చేశారు. ప్రజలు ఆదరిస్తున్న ప్రదేశంపై ఇలాంటి ‘అల్పబుద్ధి’ రాజకీయం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement