సీఐఐ– స్వర్ణాంధ్ర కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
మహారాణిపేట: భోగాపురం ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నోవాటెల్ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రెండు గంటల ప్రయాణ దూరంలో ఒక విమానాశ్రయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కొత్త నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి 50 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేలా తన శాఖ కార్యాచరణ సిద్ధం చేసిందని, భవిష్యత్తు అవసరాల కోసం 1700 విమానాలు రానున్న 16 ఏళ్లలో భారత్‌కు చేరనున్నాయని వెల్లడించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న డ్రోన్ విప్లవంలో ఏపీ ‘డ్రోన్ సిటీ’గా అవతరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే విమానాల అసెంబ్లింగ్ లైన్‌ను ఏర్పాటు చేసేందుకు ఎంబ్రయర్ సంస్థతో చర్చిస్తున్నామని, స్థానిక ఉత్పత్తి ద్వారానే పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోగలమని వివరించారు. అనంతరం సీఐఐ ప్రతినిధులు కేంద్రమంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ సీఈవో మురళి కృష్ణ, గ్రీన్ కో గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కోలి, ముత్తూట్ ఫిన్ కార్ప్ చైర్మన్ థామస్ జాన్, సీఐఐ వైస్ ఛైర్మన్ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.


