మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు మెరుగ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరించి, రాజకీయ స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, ఆయన పర్యటనలకు వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియా కేవలం పోస్టింగ్‌ల వేదిక మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం నింపే శక్తివంతమైన ఆయుధమని కేకే రాజు అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఐటీ, సోషల్ మీడియా విభాగాలపై ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను, విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తూ, చంద్రబాబుకు ప్రభుతవ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గర్భాపు అనిల్ శర్మ, గోపి రాజు వంక, బెవర జగదీశ్వరరావు, జి. పెంటరెడ్డి, గొర్లి నవీన్, గీతారెడ్డి, టి.అశోక్, నాగిరెడ్డి పోలిశెట్టి, బొడ్డేటి వేణు గోపాల్, బెవర మహేష్, దండ గణేష్, తంథాటి సంపత కుమార్, ఉమ్మిడి బాల మురళి, జిల్లా, నియోజకవర్గ, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


