ఆటో నుజ్జునుజ్జు..ముగ్గురికి తీవ్ర గాయాలు
గోపాలపట్నం: నగరంలోని కాకానినగర్ జంక్షన్‌లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎయిర్‌పోర్టు పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం 7.45 గంటల సమయంలో ఎన్‌ఏడీ నుంచి గాజువాక వైపు వెళ్తున్న ఓ లారీ, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను, మరో లారీని ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాటిచెట్లపాలేనికి చెందిన పెంటకోట మోహన విష్ణుప్రియ పాదం చితికిపోగా, కరాసాకు చెందిన ఆటో డ్రైవర్ మైలపల్లి ఢిల్లీరావు కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గణేష్ రామ్ గోపాల్ (ఛత్తీస్‌గఢ్) కూడా క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు, కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కొందరు భావిస్తుండగా.. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే డ్రైవర్ లారీని ఆపలేకపోయాడని మరికొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆటో డ్రైవర్ ఢిల్లీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


