24 నుంచి విశాఖ ఉత్సవ్‌ | - | Sakshi
Sakshi News home page

24 నుంచి విశాఖ ఉత్సవ్‌

Jan 21 2026 7:33 AM | Updated on Jan 21 2026 7:33 AM

24 నుంచి విశాఖ ఉత్సవ్‌

24 నుంచి విశాఖ ఉత్సవ్‌

● మూడు జిల్లాల వ్యాప్తంగా 20 వేదికల్లో ● అనకాపల్లిలో ముగింపు వేడుకలు

500కు పైగా ప్రదర్శనలు

బీచ్‌రోడ్డు: ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా విశాఖ ఉత్సవ్‌–2026ను ‘సీ టు స్కై’అనే నినాదంతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనంతరం, వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను మంత్రులు కందుల దుర్గేష్‌, వంగలపూడి అనిత, సంధ్యారాణి, డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ సారి విశాఖ ఉత్సవ్‌ను కేవలం నగరానికే పరిమితం చేయకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉత్సవాల ప్రారంభ వేడుకలు విశాఖపట్నంలో మొదలవుతాయని, ముగింపు సభను అనకాపల్లి జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. సాగరం నుంచి మన్యం కొండల వరకు.. మొత్తం 20 ప్రధాన వేదికల్లో 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు.

రూ.500 కోట్ల లావాదేవీలే లక్ష్యం

ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోనసీమ ప్రాంతాలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. ఈ ఉత్సవాల ద్వారా ఉత్తరాంధ్రలో దాదాపు రూ. 500 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని, తద్వారా స్థానిక యువతకు, దాదాపు 3వేల మంది కళాకారులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్‌, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, కలెక్టర్లు హరేందిర ప్రసాద్‌, విజయకృష్ణన్‌, దినేష్‌ కుమార్‌, సీపీ శంఖబ్రత బాగ్చి, ఎస్పీ తుహిన్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

అధికారుల అత్యుత్సాహం..

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అధికారుల అత్యుత్సాహం కారణంగా మంత్రి అనితకు ప్రమాదం తప్పింది. నిబంధనల ప్రకారం ఇండోర్‌ ప్రాంగణాల్లో ఎలాంటి ఫైర్‌ వర్క్స్‌ను వినియోగించకూడదు. కానీ, మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు ఈ నిబంధనలను గాలికి వదిలేశారు. వేదికపై అట్టహాసంగా స్వాగతం పలికే క్రమంలో ఎలక్ట్రానిక్‌ ఫైర్‌ వర్క్స్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి అనిత వేదికపై నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఈ ఫైర్‌ వర్క్స్‌ మొదలయ్యాయి. ఆమె వాటికి అత్యంత సమీపంలో ఉండటంతో, నిప్పు రవ్వలు ఆమె చీరకు తగిలే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆమె అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement