సమస్యలు చెప్పుకుంటే కోర్టుకు వెళ్లమంటారా?
మద్దిలపాలెం: ఏయూలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల పట్ల విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలిసిన అధ్యాపకులతో ఎంపీ మాట్లాడిన తీరును ఏయూ అతిథి అధ్యాపకుల యూనియన్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం వివరాలను యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్, ఇతర నాయకులు మీడియాకు వివరించారు.
అసలేం జరిగిందంటే? : గత పదేళ్లుగా ఏయూలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు.. తమకు కూడా రాష్ట్రంలోని ఇతర వర్సిటీల(ఉదాహరణకు డా. బి.ఆర్.అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్ల) మాదిరిగా యూజీసీ నిబంధనల ప్రకారం నెలవారీ జీతాలు ఇవ్వాలని ఎంపీని కోరారు. అయితే, దీనిపై ఎంపీ స్పందన అధ్యాపకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంబేడ్కర్ వర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేశారని చెప్పగా.. అక్కడి వీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఎంపీ వ్యాఖ్యానించారు. యూజీసీ నిబంధనల ప్రకారం గంటకు రూ.1500 చెల్లించాల్సి ఉందని, ఏయూలో అది అమలు కావడం లేదని చెప్పగా.. ‘అయితే మీరు కోర్టుకు వెళ్లండి’అని ఎంపీ సలహా ఇచ్చారు. సమస్యలతో సంబంధం లేకుండా, గత ప్రభుత్వ హయాంలో గీతం వర్సిటీ ప్రహరీని కూల్చివేశారని, ఇప్పటికీ గోడలు కట్టుకోలేని స్థితిలో ఉన్నామంటూ తన వ్యక్తిగత ఆవేదనను వెళ్లగక్కారు. వర్సిటీల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని చెబుతూనే, ఎంపీ భరత్ పదేపదే ఏయూ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని సురేష్ మీనన్ ఆరోపించారు. గతంలో ఏయూలో పేద విద్యార్థులు, గీతంలో ధనవంతులు ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశా రు. త్వరలోనే తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని డాక్టర్ శేషు, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ దాస్, భా ను, త్రినాధ్, ప్రతాప్, నారాయణ, మాథ్యూస్, రవి, ప్రశాంత్ ,శ్రీనివాస్, వేణు భాను, పవన్ తెలిపారు.
ఎంపీ భరత్‌పై
ఏయూ అతిథి అధ్యాపకుల ఫైర్


