దసరా.. ధరల జోరు.. | - | Sakshi
Sakshi News home page

దసరా.. ధరల జోరు..

Oct 2 2025 8:45 AM | Updated on Oct 2 2025 8:45 AM

దసరా.

దసరా.. ధరల జోరు..

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరం దసరా శోభను సంతరించుకుంది. పండగ పూజలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు నగరవాసులు మార్కెట్లకు పోటెత్తడంతోబుధవారం బజార్లన్నీ కిటకిటలాడాయి. అయితే ఈ పండగ ధరల భారం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పూజా సామగ్రి, పువ్వులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. ఒకవైపు నగరంలోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడితే.. శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షం వ్యాపారులను నిరాశకు గురి చేసింది.

జగదాంబ/డాబాగార్డెన్స్‌/తగరపువలస: విజయదశమి సందర్భంగా నగరంలోని పూర్ణామార్కెట్‌, కురుపాం మార్కెట్‌, అల్లిపురం, దండుబజార్‌, అక్కయ్యపాలెం, గాజువాక వంటి ప్రధాన మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఉదయం కాస్త సాధారణంగా ఉన్నా.. సాయంత్రం 4 గంటల తర్వాత జనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పూజా సామగ్రి కోసం వచ్చిన జనంతో మార్కెట్‌ లోపల, బయట వెలిసిన దుకాణాలు నిండిపోయాయి. గతంలో రూ.200 తీసుకెళ్తే సంచి నిండా సరకులు వచ్చేవని, ఇప్పుడు రూ.500 పెట్టినా సంచి నిండడం లేదని వినియోగదారులు వాపోయారు. ధరల పెరుగుదల తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. ముఖ్యంగా పువ్వుల ధరలు భగ్గుమన్నాయి. కిలో బంతి పువ్వులు రూ.250, చామంతి రూ.500కు చేరాయి. వాహనాలకు కట్టే పూల దండలు రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించారు. నాణ్యత, పరిమాణాన్ని బట్టి ఒక్కో కొబ్బరికాయ రూ.40 నుంచి రూ.70 వరకు అమ్మారు. డజను అరటిపండ్లు రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయించారు. నగరంలో రూ.20కి కేవలం మూడు నిమ్మకాయలు అమ్మగా, కొన్నిచోట్ల వాహన పూజల కోసం రూ.20కి ఆరు కాయలు విక్రయించారు. పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తి వంటి ఇతర సామగ్రి కొనాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వచ్చింది. చివరికి మామిడి ఆకుల కొమ్మలు కూడా రూ.20కి అమ్మడం గమనార్హం. పూర్ణామార్కెట్‌లో ఈ సారి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ను వన్‌ వేలో మళ్లించడం ద్వారా వినియోగదారులు సులభంగా కొనుగోళ్లు జరుపుకోగలిగారు. జేబు దొంగల పట్ల పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

శివారు మార్కెట్లపై వర్షం ఎఫెక్ట్‌

నగర కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. తగరపువలస, ఆనందపురం వంటి శివారు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వర్షం వ్యాపారుల ఆశలపై నీళ్లు చల్లింది. రహదారులు జలమయమై, బురదగా మారడంతో వినియోగదారులు మార్కెట్లకు రాలేకపోయారు. దీంతో పూజా సామగ్రి, పండ్లు, కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పూజా సామగ్రి ధరలు పెరిగినప్పటికీ, దసరా సందర్భంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గడంతో వాటి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. కొత్త దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు కూడా జనం షాపింగ్‌మాళ్లకు పోటెత్తారు.

కిటకిటలాడిన మార్కెట్లు.. చుక్కలనంటిన పూల ధరలు

దసరా.. ధరల జోరు.. 1
1/5

దసరా.. ధరల జోరు..

దసరా.. ధరల జోరు.. 2
2/5

దసరా.. ధరల జోరు..

దసరా.. ధరల జోరు.. 3
3/5

దసరా.. ధరల జోరు..

దసరా.. ధరల జోరు.. 4
4/5

దసరా.. ధరల జోరు..

దసరా.. ధరల జోరు.. 5
5/5

దసరా.. ధరల జోరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement