వెంటిలేటర్లకు సుస్తీ | - | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్లకు సుస్తీ

Oct 1 2025 11:01 AM | Updated on Oct 1 2025 11:01 AM

వెంటి

వెంటిలేటర్లకు సుస్తీ

కేజీహెచ్‌లో పనిచేయని వెంటిలేటర్లు క్యాజువాలిటీతో పాటు వివిధ విభాగాల్లో

గాల్లో పేద రోగుల ప్రాణాలు

పట్టించుకోని యంత్రాంగం

కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలనిరోగులు, వారి బంధువుల వినతి

ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న కేజీహెచ్‌లో పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఊపిరి పోయాల్సిన వెంటిలేటర్లే శ్వాస తీసుకోలేక మూలకు చేరాయి. దాదాపు 400 వెంటిలేటర్లకు గాను 300కు పైగా పనిచేయకపోవడం, ప్రభుత్వ వైద్యంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం యంత్రాల

వైఫల్యం కాదు.. పేదల పట్ల వ్యవస్థ నిర్లక్ష్యానికి నిలువుటద్దం. –మహారాణిపేట

కేజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలు కునారిల్లుతున్నాయి. ఇటీవల ఆర్టీ రియల్‌ బ్లడ్‌ గ్యాస్‌(ఏబీజీ) పరీక్షలు నిలిచిపోయాయి. వ్యాధులు నిర్ధారించే రక్త పరీక్షల కోసం పేదలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రోగికి పునర్జన్మనివ్వడంలో కీలక పాత్ర పోషించే వెంటిలేటర్లు భారీ సంఖ్యలో మరమ్మతులకు గురై మూలనపడటంతో.. నిరుపేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.

పనిచేయనివి 311

కేజీహెచ్‌లోని 26కు పైగా విభాగాల్లో సుమారు 403 వెంటిలేటర్లు ఉండగా.. ప్రస్తుతం కేవలం 92 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిసింది. అంటే సుమారు 311 వెంటిలేటర్లు పనిచేయడం లేదు. క్యాజువాలిటీ, ఐసీయూ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ వంటి అత్యంత కీలకమైన విభాగాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డు, అగ్ని ప్రమాద బాధితులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారికి వెంటిలేటర్‌ అత్యవసరం. అలాంటి ప్రాణదాతలే పనిచేయకపోవడంతో.. వైద్యులున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. వార్డుల్లో పనిచేయని యంత్రాలను పక్కన పడేయడం గమనార్హం.

వెంటిలేటర్లదే కీలకపాత్ర

రోగుల ప్రాణాలను కాపాడడంలో వెంటిలేటర్‌ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న వారికి, ఈ యంత్రం ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపి, వారు తిరిగి తమంతట తాము శ్వాస తీసుకునే వరకు జీవనాధారంగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఆస్పత్రి, అంబులెన్స్‌, ఇతర ముఖ్యమైన ఆరోగ్య సేవా కేంద్రాల్లో వెంటిలేటర్లను అత్యవసరంగా సిద్ధంగా ఉంచుతారు. అయితే, ఇంతటి కీలకమైన వెంటిలేటర్లు కేజీహెచ్‌లో పనిచేయకపోవడం ఇప్పుడు రోగులకు ప్రాణాలకు సంకటంగా మారింది. కాగా.. కేజీహెచ్‌లో వెంటిలేటర్‌ సదుపాయం ఉచితంగా లభిస్తుంది. అదే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోజుకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం మోయలేక ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ప్రైవేట్‌లో చికిత్స చేయించలేక, చివరికి కేజీహెచ్‌కే తిరిగి వస్తున్న రోగులు ఎందరో.. అలాంటి వారికి ఇక్కడ కూడా వెంటిలేటర్‌ సదుపాయం అందకపోవడంతో.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది.

పట్టని యంత్రాంగం

కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఆస్పత్రిలో 1,187 పడకలు ఉండగా.. నిత్యం 2,500 మందికి పైగా రోగులకు ఇక్కడ వైద్యం అందుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 1,500 నుంచి 2,200 వరకు ఓపీ నమోదవుతుంది. రోజూ 300 నుంచి 600 మంది రోగుల వరకు ఇన్‌పేషంట్లుగా చేరుతుంటారు. అయితే వారికి తగ్గట్లు మౌలిక వసతులు పెరగడం లేదు. ఉన్న వైద్య పరికరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. కొద్ది రోజుల కిందట ఏబీజీ రక్త పరీక్షల యంత్రాలు పనిచేయకపోవడం, ఇప్పుడు వెంటిలేటర్ల సమస్య రావడం ఇక్కడి నిర్లక్ష్యానికి నిదర్శనం. పాలనాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. పేదల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై కలెక్టర్‌ వెంటనే దృష్టి సారించాలని, మరమ్మతులకు గురైన వెంటిలేటర్లను బాగు చేయించాలని రోగుల బంధువులు, ప్రజలు కోరుతున్నారు.

మూలకు చేరిన వెంటిలేటర్‌

మూలకు చేరిన ప్రాణదాతలు

వెంటిలేటర్లకు సుస్తీ 1
1/2

వెంటిలేటర్లకు సుస్తీ

వెంటిలేటర్లకు సుస్తీ 2
2/2

వెంటిలేటర్లకు సుస్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement