
● మెడికల్ షాపుల్లో కనిపించని జీఎస్టీ తగ్గింపు బోర్డులు
మహారాణిపేట: ప్రజలకు దసరా కానుకగా జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త శ్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే ప్రతి ఇంట్లో ఉపయోగించే మందులపైన ప్రజల్లో అవగాహన లోపం వ్యాపారులకు వరంగా మారింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తేదీకి ముందే రేట్లు ముద్రించడంతో అవి కాస్తా హోల్‌సేల్ నుంచి రిటైల్ షాపులకు చేరాయి. దీంతో జీఎస్టీ తగ్గింపు సాధ్యపడే పరిస్థితి లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కేంద్రం పాత రేట్లతో పనిలేదు.. జీఎస్టీ తగ్గింపు నాటి నుంచే అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే అది అమలుకావడం లేదు. దీంతో మందుల్లో మతలబుతో జనానికి ఎటువంటి ఊరట లభించడం లేదు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అదనపు బేరం
చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్‌పీకే విక్రయిస్తున్నారు.
ప్రతి షాపులో జీఎస్టీ తగ్గింపు బోర్డు పెట్టాలి
ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని మెడికల్ షాపులు, హోల్‌సేల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు ప్రకారం తగ్గించిన ధరలకే మందులు విక్రయించాలని ఉత్తర్వులు ఇచ్చాం. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులతో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాం. అంతేకాక ప్రతి షాపులో జీఎస్టీ తగ్గింపు ధరలు బోర్డు పెట్టి ధరలు ప్రకటించాలని ఆదేశించాం.
–విజయకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, విశాఖ
నిలువు దోపిడీ, బిల్లుల మాయం
జిల్లాలోని దాదాపు 2,200 మెడికల్ స్టోర్స్, 600 హోల్‌సేల్ షాపుల్లో మందుల కొనుగోలుకు బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అమల్లోకి కొత్త జీఎస్టీ
మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడ ఈ బోర్టులు కనపించడం లేదు.