
వాణిజ్యాన్ని గాలికొదిలేశారు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని అందించే రెండో డివిజన్. చంద్రబాబు పదే పదే ఆర్థిక రాజధాని నగరమని చెప్పే ప్రాంతం.. దీనికి తోడు.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల అమలు కసరత్తులు.. ఇలా.. నిరంతర పనిభారం ఉన్న డివిజన్‌పై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల డివిజన్ ప్రధాన కార్యాలయంలో ప్రధాన పోస్టుల భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా.. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సహా ప్రతి ఒక్కరిపైనా పనిభారం పెరిగిపోతోంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. విశాఖ జిల్లాని మొత్తం 8 సర్కిల్స్‌గా విభజించి జీఎస్‌టీ వసూలు చేసేవారు. విశాఖ మహా నగర పరిధిలో మొత్తం 7 సర్కిల్స్, రూరల్ జిల్లాలోని మండలాలన్నీ కలిపి ఒక సర్కిల్ (అనకాపల్లి) మొత్తం 8 సర్కిల్స్ పరిధిలో 42 వేల మంది డీలర్స్ నుంచి పన్ను వసూళ్లు జరిగేవి. అయితే విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఈ నేపథ్యంలో డివిజన్‌లో ఉన్న ఎనిమిది సర్కిల్స్‌ని 14 సర్కిల్స్‌గా విభజించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తాన్ని ఒక సర్కిల్‌గా ఏర్పాటు చేసి దీనికి పాడేరు సర్కిల్ అని పేరుని సూచించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాను రెండు సర్కిల్స్‌గా విభజించారు. ఒకటి అనకాపల్లి సర్కిల్, రెండు అచ్యుతాపురం సర్కిల్‌గా నామకరణం చేశారు. ఇక మిగిలిన విశాఖ జిల్లాను మొత్తం 11 సర్కిల్స్‌గా విభజించారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉన్న వార్డులతో పాటు జిల్లా పరిధిలో ఉన్న ఆనందపురం, భీమిలి మండలాల్ని కలుపుకొని విభజన చేపట్టారు. కొత్తగా భీమిలి, మాధవధార, ఎయిర్‌పోర్టు సర్కిల్‌ని ఏర్పాటు చేశారు. వీటికితోడుగా గాజువాక, సిరిపురం, కురుపాం, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, సిరిపురం, చినవాల్తేరు, స్టీల్‌ప్లాంట్ సర్కిల్స్‌గా విభజించారు. ప్రస్తుతం ఉన్న గాజువాక సర్కిల్‌ని గాజువాక, ఎయిర్‌పోర్టుగా విభజించారు. ప్రతి సర్కిల్ నుంచి దాదాపు సమాన ఆదాయం వచ్చేలా సర్దుబాటు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ అధికారుల నియామకాలు సక్రమంగా నిర్వహించారు. కూటమి వచ్చిన తర్వాత డివిజన్‌ని గాలికొదిలేసింది.
ఏడాదికి పైగా ముక్కుతూ మూలుగుతూ..
డివిజన్ విభజన సమయంలో జాయింట్ కమిషనర్ పోస్టులను రెండుగా విభజించారు. జేసీ–1గా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో జేసీ–1గా ఓ.ఆనంద్ వ్యవహరించారు. జేసీ–2గా సుధాకర్ విధులు నిర్వర్తించారు. ఆనంద్‌ని 2024 ఎన్నికల తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెగ్యులర్ జాయింట్ కమిషనర్‌ను నియమించలేదు. జేసీ–2గా సుధాకర్ స్థానంలో కిరణ్‌కుమార్‌ని నియమించారు. మూడు నెలల క్రితం జేసీ–2గా కిరణ్‌కుమార్ స్థానంలో శేషాద్రిని నియమించారు. కానీ.. జేసీ–1 నియామకం విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఇప్పటి వరకూ జేసీ–1తో పాటు ఆయన విభాగంలో పనిచేసే మిగిలిన అదికారుల నియామకంపైనా కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. జేసీ–1తో పాటు.. డిప్యూటీ కమిషనర్–1, డిప్యూటీ కమిషనర్–2, నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు(సీటీవోలు) పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారిని మూడు నెలల క్రితం బదిలీ చేసి వారి స్థానాల్ని ఇంతవరకూ భర్తీ చెయ్యలేదు. దీంతో జేసీ–1 పరిధిలో ఉన్న ఐదుగురు అధికారులు నిర్వర్తించే విధులన్నీ ఒకే అధికారిపై భారం పడింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో ఫైళ్లు భారంగా కదులుతున్నాయి. జీఎస్‌టీ సంస్కరణలు వచ్చిన తర్వాత పని ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో జేసీ–2తో పాటు ఇతర విభాగాల్లో ఉన్న అందరు ఉద్యోగులు నిరంతరం పనిచెయ్యాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులకు వారాంతపు సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నారనీ.. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చెయ్యాలని అసోసియేషన్లు ప్రభుత్వానికి పదే పదే నివేదించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో.. అతి పెద్ద డివిజన్‌లో పనుల నిర్వహణ ఒత్తిడితో ఉద్యోగులు, అధికారులు సతమతమవుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే అధికారుల పోస్టులు భర్తీ చెయ్యాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.