
రుణగ్రహీతలకు ప్రమాద బీమా సౌకర్యం
సింహాచలం: అడవివరం కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యత్వం కలిగిన రుణగ్రహీతలకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి తెలిపారు. అడవివరం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మహాజన సభ ఆదివారం స్థానిక కల్యాణమండపంలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేశారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. సంఘ సభ్యులందరికీ ప్రమాద బీమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న జనవరి నుంచి సభ్యత్వం కలిగిన ఎస్టీ, ఎంటీ, ఎల్‌టీ, మార్ట్‌గేజ్ లోన్లు తీసుకున్నవారందరికీ ప్రమాద బీమా చేస్తామని, ఆ తర్వాత సభ్యులందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. 2023 మార్చి 31లోపు బంగారు వస్తువులపై రుణాలు తీసుకుని, తిరిగి విడిపించని వారి వస్తువులను త్వరలో వేలం వేస్తామన్నారు. సింహాచలంలోని సొసైటీ ప్రధాన భవనం అంతస్తు నిర్మాణ పనులు గతంలో నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే ప్రహ్లాదపురంలోని సొసైటీ స్థలంలో భవనం నిర్మాణానికి కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. లోన్ల రికవరీకి సంబంధించి వన్–టైమ్ సెటిల్‌మెంట్ కూడా అందుబాటులో ఉందని, రుణగ్రస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సభ్యుల ప్రవేశ రుసుంను పెంచే యోచన చేస్తున్నామన్నారు. సొసైటీ ఉద్యోగులకు డీఏ, ఇంక్రిమెంట్లు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి సంబంధించి అంచనా ఆదాయ, వ్యయాల బడ్జెట్‌ను సభ్యులకు తెలియజేశారు. సొసైటీ ఉపాధ్యక్షుడు బంటుబిల్లి మహేష్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
‘అడవివరం’సొసైటీ అధ్యక్షుడు అప్పలస్వామి