
అమ్మో..బస్సు ఎక్కలేం ..!
పురుష ప్రయాణికులకు అష్టకష్టాలు ● దసరాకు ‘సీ్త్ర శక్తి’ ఎఫెక్ట్
‘జై సీ్త్ర శక్తి’ అనే నినాదం ఇప్పుడు రోడ్లపై వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులకు నినాదం కాదు... పురుష ప్రయాణికుల గుండెల్లో గుబులు! దసరా రద్దీ మామూలే అనుకుంటే, ఉచిత ప్రయాణం (జీరో టికెట్) రూపంలో మహిళా ప్రయాణికుల రద్దీ పెరగగా..పురుషులకు శాపంగా మారింది. ప్రతీ బస్సు మహిళలతో నిండి, ఏమాత్రం ఖాళీ లేకుండా ప్రయాణిస్తుంటే... బస్సు కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న పురుషులు లబోదిబోమంటున్నారు. ‘గతంలో బస్సు రాగానే కనీసం నిలబడేందుకై నా చోటు దొరికేది. ఇప్పుడు బస్సు డోర్ దగ్గర కాలు పెట్టేందుకు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు, అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మరో ప్రయాణికుడైతే...‘ఆర్టీసీ ఇకపై’’ఆంధ్రప్రదేశ్ మహిళా రోడ్డు రవాణా సంస్థ’గా పేరు మార్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. –డాబాగార్డెన్స్
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల రద్దీ
దసరా పండుగ సందర్భంగా కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ద్వారకాబస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అయితే ఈ రద్దీకి తోడు ‘సీ్త్ర శక్తి’ పథకం ప్రభావం తోడవడంతో పురుష ప్రయాణికులు బస్సుల్లో చోటు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టేషన్‌లో పురుషుల కంటే మహిళా ప్రయాణికులే అధికంగా కనిపిస్తున్నారు. ఉచిత ప్రయాణం (జీరో టికెట్) కారణంగా వచ్చిన బస్సులన్నీ మహిళలతో పూర్తిగా నిండిపోతుండటంతో, పురుషులు నిలబడేందుకు కూడా చోటు దొరకక లబోదిబోమంటున్నారు. వచ్చిన బస్సు తమకు దక్కడం లేదని, ఈ పరిస్థితిపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నామని పలువురు పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీ
దసరా సెలవుల కోసం ఉద్యోగులు, కార్మికు లు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలివెళ్లారు. బొబ్బిలి, పార్వతీపురం, రాజాం, సాలూరు, పాలకొండ, శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఇచ్చాపురం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది.
1500 బస్సు సర్వీసులు నడుపుతున్నాం..
దసరా పండగ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ నుంచి వివిధ ప్రాంతాల కు 1500 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణాధికారి బి.అప్పలనాయు డు తెలిపారు. గతేడాది విజయనగరం జోన్ నుంచి 913 ప్రత్యేక సర్వీసులు నడిపామని, ఈ ఏడా ది శ్రీకాకుళం నుంచి వివిధ ప్రాంతాలకు (హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఇతర ప్రాంతాలకు) 477, పార్వతీపురం నుంచి వివిధ ప్రాంతాలకు 227, విజయనగరం నుంచి 202, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 45, విశాఖ నుంచి హైదరాబాద్‌కు 2, విజయవాడకు 120, రాజమండ్రికి 120, ఇతర ప్రాంతాలకు 100 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు చెప్పారు. అలాగే అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు 2, విశాఖకు 35, విజయవాడకు 90, రాజమండ్రికి 10, ఇతర ప్రాంతాలకు 70 బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు.

అమ్మో..బస్సు ఎక్కలేం ..!