ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు | - | Sakshi
Sakshi News home page

ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు

Sep 29 2025 11:14 AM | Updated on Sep 29 2025 11:14 AM

ఒక సా

ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు

వాల్తేరు డివిజన్‌లో ఇద్దరు జీఎంల హడావుడి

దక్షిణ కోస్తా జోన్‌ జీఎం సందీప్‌ మాధుర్‌ వరుస రివ్యూలు

అదే సమయంలో ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌ జీఎం పరమేశ్వర్‌ పర్యటనలు

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతోనే తలపోటు

ముంబై బదిలీ కోసం డీఆర్‌ఎం ప్రయత్నాలు ముమ్మరం

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం

అన్నట్లుగా ఉంది.. వాల్తేరు డివిజన్‌ డివిజనల్‌ రైల్వే

మేనేజర్‌(డీఆర్‌ఎం) పరిస్థితి. ఒక సార్‌కి ఇద్దరు బాస్‌లు

ఉండడంతో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. తెలియక

అయోమయంలోనూ.. అదే సమయంలో ఒత్తిడికి గురవు

తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంని ప్రకటించిన

కేంద్రం.. ఇంకా గెజిట్‌ విడుదల చేయకపోవడంతో ఎవరికి

వారే అన్న చందంగా మారింది. ఇద్దరు జీఎంల మధ్య

నలిగిపోతున్న డీఆర్‌ఎం.. ఇదేం బాధరా భగవంతుడా

అనుకుంటూ బదిలీ కోసం పాట్లు పడుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించి ఆరేళ్లు దాటినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి’ అన్నట్లుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, రైల్వే బోర్డు నిర్లక్ష్యం కారణంగా కార్యకలాపాలు మొదలు కాలేదు. మూడు నెలల క్రితం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జీఎంగా నియమితులైన సందీప్‌ మాధుర్‌ నెల రోజులుగా విశాఖలోనే ఉంటూ, గెస్ట్‌ హౌస్‌ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ముడసర్లోవ ప్రధాన కార్యాలయ పనులు పర్యవేక్షిస్తూ, డీఆర్‌ఎం లలిత్‌ బోరాతో కలిసి సమీక్షలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే జోన్‌ ఏర్పాటు కాగితాలకే పరిమితం కావడంతో డీఆర్‌ఎంపై ఒత్తిడి మొదలైంది.

నాకొద్దు బాబోయ్‌.!

ఒక సార్‌ రివ్యూలు చేస్తూ బయలుదేరితే, మరొక సార్‌ ఫోన్‌లో ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బోరా, డివిజనల్‌ అధికారుల పరిస్థితి ఇదే. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కొత్త జీఎం, మరోవైపు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జీఎం కలిసి డీఆర్‌ఎంతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్త జీఎం రివ్యూలతో, ఆ తర్వాత రోజు ప్రస్తుత జీఎం పర్యటనలతో డీఆర్‌ఎం క్షణం తీరిక లేకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల ఒక జీఎం పర్యటనలో ఉన్న సమయంలోనే, మరో జీఎం ఫోన్‌ చేసి లైన్లు పరిశీలించేందుకు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు. సమీక్షలు కూడా ఇరు జీఎంలు పోటాపోటీగా నిర్వహిస్తుండటంతో, వారికి సమాధానం ఇవ్వడంలోనూ, ఏర్పాట్లలోనూ అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దీంతో అధికారుల్లో కొందరు తమ ఉద్యోగాలపై విరక్తి చెందుతూ తలలు పట్టుకుంటున్నారు. ఇక డీఆర్‌ఎం లలిత్‌ బోరా పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో గడిపే తీరిక కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాల్తేరులో పనిచేయడం కంటే, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకోవడం మంచిదంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ముంబైకి బదిలీ చేయాలంటూ రైల్వే బోర్డును కోరినట్లు సమాచారం.

గెజిట్‌ లేకపోవడమే అసలు సమస్య

వాల్తేరు డివిజన్‌లో నెలకొన్న మొత్తం ‘తలపోటు’ వ్యవహారానికి ప్రధాన కారణం.. జోన్‌కు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెజిట్‌ వస్తేనే సందీప్‌ మాధుర్‌ జోన్‌కు అసలైన జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరించగలరు.. అప్పుడు కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గెజిట్‌తో పాటు కార్యాచరణ ప్రకటించిన తర్వాతే.. జీఎంతో పాటు అసిస్టెంట్‌ జీఎం, 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్‌ హెచ్‌వోడీలు, సిబ్బంది సహా మొత్తంగా దాదాపు 180 మంది అధికారుల నియామకం పూర్తవుతుంది. వీరి నియామకం తర్వాతే జోన్‌ ఆపరేషన్స్‌ మొదలయ్యే అవకాశం ఉంది. అధికారుల నియామకాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నా, గెజిట్‌ రాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వాల్తేరు అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరాకు కూడా జోన్‌ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.

అడకత్తెరలో పోకచెక్కలా వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బోరా పరిస్థితి

చురుగ్గా తాత్కాలిక కార్యాలయం పనులు

వీఎంఆర్‌డీఏ ‘ది డెక్‌’లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త జోన్‌కు ఇప్పటికే ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ (పీసీఎంఏ), ఎలక్ట్రికల్‌ విభాగంలో హెచ్‌ఏజీ అధికారి (హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌)తో సహా మరో ఇద్దరి నియామకాలు పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా టెంపరరీ ఆఫీస్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కార్యాలయంలో విధులు ప్రారంభించాలన్నా గెజిట్‌ విడుదల తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. దీంతో గెజిట్‌ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఇది నా సంస్థానమంటూ..!

దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు కొత్త జీఎంను నియమించినా గెజిట్‌ విడుదల చేయకపోవడంతో భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోనే వాల్తేరు డివిజన్‌ కొనసాగుతోంది. జీఎం సందీప్‌ మాధుర్‌ జోన్‌ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా.. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జీఎం పరమేశ్వరన్‌ ఫంక్వాలా కూడా హడావుడి మొదలుపెట్టారు. ఇంకా గెజిట్‌ రాకపోవడంతో వాల్తేరు డివిజన్‌కు తానే జీఎంనంటూ వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారు.

ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు1
1/2

ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు

ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు2
2/2

ఒక సార్‌.. ఇద్దరు బాస్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement