
టెట్ నుంచి ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
ఆరిలోవ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదేళ్ల పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని పైడిరాజు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. రాష్ట్రంలో 1995 నుంచి వివిధ డీఎస్సీల ద్వారా నియమితులైన వేలాది మంది ఉపాధ్యాయులకు ఈ నిబంధన తీవ్ర సమస్యగా మారింది. ఈ నిబంధన వల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోవడంతో పాటు, కొందరు ఉద్యోగాలను కూడా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పైడిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.