
మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు
సీతంపేట: నగరానికి చెందిన పైడి శంకర్రావు దర్శకత్వంలో సుదీప్ సాయి హీరోగా నటించిన లఘు చిత్రం ‘మనసు’కు అరుదైన గౌరవం లభించింది. ఈ లఘు చిత్రాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సాహిత్య అకాడమీ మాజీ సభ్యుడు డాక్టర్ సుందర్ మురుగన్ ఈ లఘు చిత్రం ఇతివృత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.మనసు లఘు చిత్రం భారతీయుల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ, భావితరాలకు మెరుగైన మార్గనిర్దేశం చేసేలా ఉందని సీఎం రంగస్వామి కొనియాడారు. ఈ సందర్భంగా దర్శకుడు పైడి శంకర్రావు, హీరో సుదీప్ సాయిని సీఎం సత్కరించారు. చిత్ర యూనిట్ తరఫున నిర్మాత పైడి సత్యమణి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.