
పీహెచ్‌సీ డాక్టర్ల ఆందోళన తీవ్రతరం
అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమణ
మహారాణిపేట: తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. నిరసనలో భాగంగా ఆదివారం నుంచి సుమారు 15 అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి డాక్టర్లు బయటకు వచ్చారు. ఈ గ్రూపుల్లో రోగుల సమాచారం , ప్రభుత్వ డేటా సేకరణ వంటి ముఖ్యమైన అధికారిక పనులు జరుగుతుంటాయి. భీమిలి, ఆనందపురం, గాజువాక వంటి పలు ప్రాంతాల పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సుమారు 20 మంది వైద్యులు ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈనెల 26 నుంచే వారు అన్ని అధికారిక పనులను నిలిపివేశారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగుల వివరాలను ఆన్‌లైన్ లో నమోదు చేయకుండా నిలిపివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి పంపాల్సిన రోజు వారీ రోగుల సమాచారం నిలిచిపోయింది. ‘ స్వస్త్ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్’, క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు, నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వేలతో పాటు సంచార చికిత్స, ఇతర మెడికల్ క్యాంపులను కూడా డాక్టర్లు బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ నాయకుడు డాక్టర్ జగదీష్ తెలిపారు. సోమవారం పీహెచ్‌సీల్లో అన్ని ఓపీ డ్యూటీల బహిష్కరిస్తున్నామన్నారు.