
‘చలో మెడికల్ కళాశాల’ విజయవంతం
పెందుర్తి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వానికి ఏమీ పాలుపోవడం లేదన్నారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదనే నాయకుల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారన్నారు. ఇప్పటికై నా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతంలో 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందని, 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.