
● అధికారమనే జులుంతో కూటమి నేతలు ● కోళ్ల వ్యర్థాల వాహనం
‘కోడి’ నిబంధనలకు ‘గండి’
డాబాగార్డెన్స్: అధికార పార్టీకి చెందిన నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కోడి వ్యర్థాల సేకరణ, తరలింపుపై కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించినప్పటికీ, కొందరు నాయకులు, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్నారు.
కౌన్సిల్‌లో నిర్ణయం ఇలా..
ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో కోడి వ్యర్థాల సమస్యపై తీవ్ర చర్చ జరిగింది. కమిషనర్ గార్గ్ మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించడానికి జీవీఎంసీయే స్వయంగా కోడి వ్యర్థాలను సేకరించి, కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని నియమిస్తుందని తెలిపారు. కౌన్సిల్ సభ్యులందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఆరిలోవలో పట్టుబడ్డ కోడి వ్యర్థాల వాహనం
ఆదివారం ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో కమిషనర్ నియమించిన ప్రత్యేక బృందం కోడి వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న ఒక వాహనాన్ని పట్టుకుంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జికి చేరినట్లు సమాచారం. వెంటనే ఆయన అధికారులకు ఫోన్ చేసి, ఒత్తిడి తీసుకురావడంతో ఆ వాహనాన్ని వదిలేశారని పలువురు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లే గుసగుసలాడుకుంటున్నారు.
కొత్త కాంట్రాక్టులు, పాత దందా
కోడి వ్యర్థాల సేకరణకు సంబంధించి జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లకు 8 మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే, కొందరు కూటమి నేతలు తమ సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుని కోడి వ్యర్థాలను సేకరిస్తున్నారని, వాటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు కాకుండా చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై కార్పొరేటర్లు ఫొటోలతో సహా ఫిర్యాదు చేసినా, అధికారులు వాహనాలను పట్టుకుని మళ్లీ వదిలేయడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు.
కీలకంగా కూటమి ఎమ్మెల్యేలు
ఈ వ్యవహారంలో కీలకమైన కూటమి ఎమ్మెల్యేలతో పాటు, తెర వెనుక ఉండి రౌడీషీటర్ల ద్వారా వ్యవహారం నడిపిస్తున్న జీవీఎంసీలోని కీలక నేత తీరుపైనా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక అధికారిని సిటీ వెటర్నరీ అధికారి పదవి నుంచి తొలగించడం కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.