
ఓనం.. ఆనందం
మురళీనగర్: విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన విశాఖపట్నంలో కేరళీయుల సాంస్కృతిక వైభవం వెల్లివిరిసింది. తమ వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో.. బిర్లా కూడలి సమీపంలోని కేరళ కళాసమితిలో ఆదివారం ఓనం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కేరళీయులు నిర్వహించిన ఈ వేడుకలు కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. ముందుగా తమ ఆరాధ్య దైవమైన బలి చక్రవర్తికి స్వాగతం పలికే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మేళతాళాల నడుమ మహిళలు దీపాలతో, ఛత్రంతో బలి చక్రవర్తిని వేదికపైకి ఆహ్వానించారు. ఆయన రాకతో సభాప్రాంగణం మొత్తం లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించింది. అనంతరం బలి చక్రవర్తి ప్రజలందరినీ ఆశీర్వదించి, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముందు, మహిళలు పూలతో అందంగా అలంకరించిన ‘ఓనపూక్కళం’వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రదక్షిణలు చేశారు. అనంతరం కేరళ ఎంపీ బెన్ని బెహనన్, ఎమ్మెల్యే ఎం.ఎస్. అరుణ్ కుమార్, ఇతర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ‘తిరువాదిరకళి’ నృత్యం, శాసీ్త్రయ నృత్యమైన ‘మోహినియాట్టం’, పులివేషాలు, చెండమేళం వాయిద్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేరళ ఎంపీ బెన్ని బెహనన్ మాట్లాడుతూ.. ఎక్కడ ఉన్నా స్థానిక ప్రజలతో కలిసిపోతూ తమ సంస్కృతిని కాపాడుకోవడం కేరళీయుల ప్రత్యేకత అని అన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మావిలెక్కిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం.ఎస్. అరుణ్ కుమార్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిలు కేరళీయులకు ఓనం శుభాకాంక్షలు తెలిపి, తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. నగరం నలుమూలల నుంచి సుమారు 1,500 మంది కేరళీయులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. చివరగా 29 రకాల పదార్థాలతో తయారు చేసిన కేరళీయలు ప్రత్యేక విందు భోజనం ‘సాద్య’ను సామూహికంగా ఆరగించారు. కార్యక్రమంలో కేరళ కళాసమితి అధ్యక్షుడు జె.థామస్, జనరల్ సెక్రటరీ హరిదాస్, కై రళీ ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ శశిధరణ్ పిళ్‌లై, వీఎండబ్ల్యూఏ అధ్యక్షుడు కేపీ వర్గీస్, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత నందినీ మేనన్ తదితరులు పాల్గొన్నారు.

ఓనం.. ఆనందం

ఓనం.. ఆనందం