
ఆటో బోల్తా పడి యువకుడి దుర్మరణం
తగరపువలస: ఆనందపురం మండలం గిడిజాల పంచాయతీ వేమగొట్టిపాలెం శివారులో ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భీమిలి జోన్ రెండో వార్డు రాజలింగంపేట గ్రామానికి చెందిన బోర జగదీష్ (25) దుర్మరణం చెందాడు. ఆనందపురం ట్రాఫిక్ ఎస్‌ఐ పాపారావు తెలిపిన వివరాలివి. రాజలింగంపేటకు చెందిన ఆరుగురు యువకులు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ధారలోవ అమ్మవారి గుడికి వెళ్లి భీమిలి తిరిగి వస్తున్నారు. వేమగొట్టిపాలెం శివారులో రోడ్డు మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన జగదీష్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరొక యువకుడికి కాలు విరిగిపోయింది. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్ మృతితో రాజలింగంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.