
భావోద్వేగభరితంగా ‘చండాలిక’
దుర్గామాత అవతరణలో..
ముగిసిన 17వ వైశాఖి నృత్యోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న 17వ వైశాఖి జాతీయ నృత్యోత్సవాలు ఆదివారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఐసీసీఆర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ వేడుకలు జరిగాయి. ముగింపు రోజున పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
కళ్లకు కట్టిన చండాలిక కథ
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంగ్సుమాన్ గుప్తా బృందం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘చండాలిక’ కథను అద్భుతంగా ప్రదర్శించింది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో అంటరానితనానికి గురైన ఒక యువతి కథను కథాకళి, మణిపురి, జానపద నృత్యరీతులతో కళ్లకు కట్టారు. ఆమె పుట్టుక, ఎదుగుదల, సమాజం నుంచి ఎదురైన బహిష్కరణ వంటి ఘట్టాలను భావోద్వేగభరితంగా పండించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అనంతరం కర్ణాటకకు చెందిన సుజయ్ శాన్‌బాగ్ బృందం ‘దుర్గా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన భరతనాట్య రూపకాన్ని ప్రదర్శించింది. భారతీయ సంస్కృతి, సరస్వతీ నది ఒడ్డున ధర్మం వికసించిందని, లోకంలో ధర్మానికి హాని కలిగినప్పుడు శక్తి స్వరూపిణి అయిన దుర్గా మాత అవతారాలతో దాన్ని ఎలా పునరుద్ధరిస్తుందో వివరిస్తూ వారు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తొలుత ఉత్సవ గౌరవ అధ్యక్షుడు, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి సుదగాని రవిశంకర్ నారాయణ్, ఇతర అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి నృత్యాలు గొప్ప చిహ్నాలని, కళాకారులను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు బత్తిన విక్రమ్ గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఫెస్టివల్ డైరెక్టర్లు సాయి వెంకటేష్(కర్ణాటక), కాశ్మీర త్రివేది(మహారాష్ట్ర), డా.సజని వల్లభనేని, ఎం.భారతి(తెలంగాణ), జగబంధు జెనా(ఒడిశా), అనుపమ మోహన్(కేరళ) పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను, ఉత్సవ నిర్వాహకులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
చండాలిక
నాట్య రూపకం

భావోద్వేగభరితంగా ‘చండాలిక’

భావోద్వేగభరితంగా ‘చండాలిక’