
మూట్ కోర్టు పోటీల విజేత బెంగళూరు
పీఎంపాలెం: జీవీఎంసీ 8వ వార్డులోని ఎన్‌వీపీ లా కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఆళ్వార్ నేషనల్ మూట్ కోర్ట్–25 పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన 30 లా కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతగా నిలిచిన బెంగళూరు బీఎంఎస్ లా కళాశాల జట్టు రూ.40 వేల నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ ఐసీఎఫ్‌ఏఐ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి లభించింది. ఉత్తమ వక్తగా కోయంబత్తూరు ప్రభుత్వ లా కళాశాల విద్యార్థిని ఎస్.మంజరి రూ.10 వేలు, ఉత్తమ పరిశోధకురాలిగా పంజాబ్ లా విద్యార్థి శ్రేష్ట రూ.10 వేలు, ఉత్తమ ప్లీడింగ్స్ అండ్ మెమోరియల్స్‌గా క్రైస్ట్ యూనివర్సిటీ విద్యార్థి రూ.10వేలు నగదు బహుమతులను అందుకున్నారు. ముగింపు కార్యక్రమంలో ఏయూ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి. కృష్ణ మోహన్, సీనియర్ న్యాయవాది వి.రవీంద్ర ప్రసాద్, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు జి.రామారావు, లా కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికాదాస్, చైర్మన్ డాక్టర్ సుంకరి రవీంద్ర, అంబేడ్కర్ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతా మాణిక్యం, లా కళాశాల ప్రిన్సిపాల్ అలక్ చంద్రుడు, ఇతర న్యాయవాదులు, లా విద్యార్థులు పాల్గొన్నారు.