
విశాఖ అభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖ నగర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విశాఖ సమగ్రాభివృద్ధి కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలో జరిగిన సారఽథ్యం ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.625 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోందని, అలాగే విశాఖ రైల్వే జోన్ సిద్ధమైందని పేర్కొన్నారు. కోట్లాది మంది కార్యకర్తల కృషి వల్లే దేశాన్ని బీజేపీ అభివృద్ధి పథంలో నడిపించగలుగుతోందని ఆయన ప్రశంసించారు. 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, పునర్వైభవం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి, అఖిల భారత నాయకత్వానికి దానిని గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు అనుమతులు వేగంగా మంజూరవుతున్నాయని తెలిపారు. అలాగే, అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రధాని మోదీ భారీ ప్యాకేజీలు ఇచ్చారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆర్థిక భారం ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అమరావతి వేగంగా రూపుదిద్దుకుంటోందని, అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని ఆయన వివరించారు. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురాంరాజు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, డా.పార్థసారథి, రామకృష్ణారెడ్డి, విష్ణుకుమార్‌రాజు, ఈశ్వరరావు, ఎంపీలు సీఎం రమేష్, పీవీ సత్యనారాయణ, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాస్థలివద్ద ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్స్, పొందురు ఖాదీ, ఏటికొప్పాక బొమ్మల స్టాళ్లను నడ్డా సందర్శించారు. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు.
బీజేపీ పదాధికారులతో సమావేశం
ఎంవీపీకాలనీ: బీజేపీ రాష్ట్ర పదాధికారులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అధ్యక్షతన ఆదివారం నగరంలోని ఓ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతానికి అవలంభించాల్సిన కార్యచరణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సారఽథ్యం ముగింపు సభలో
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా